మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా..నిక్ బోస్ట్రోమ్ ఏమన్నాడంటే?
Publish Date:Nov 25, 2026
Advertisement
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉందని స్వీడిష్ తత్వవేత్త, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ నిక్ బోస్ట్రోమ్ విశ్లేషించారు. తన తాజా పరిశోధన పత్రంలో ఆయన ఈ అంశాన్ని గణిత నమూనాలతో వివరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 'ఆప్టిమల్ టైమింగ్ ఫర్ సూపర్ ఇంటెలిజెన్స్' అనే అధ్యయనంలో బోస్ట్రోమ్ వయసు పెరగడం వల్ల తలెత్తే మరణ ముప్పును లెక్కగట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కుల వార్షిక మరణాల రేటు సుమారు 0.05 నుంచి 0.08 శాతం మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు 0.07 శాతం ప్రమాద రేటు జీవితాంతం స్థిరంగా కొనసాగితే, ప్రమాదాలు లేదా ఇతర అసాధారణ ఘటనలు మినహాయిస్తే సగటు ఆయుష్షు 1,400 ఏళ్ల దాకా చేరవచ్చని అంచనా వేశారు. అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు వైద్య పరిశోధనలను వేగవంతం చేయగలవని బోస్ట్రోమ్ అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న కణాలను, కణజాలాలను పునరుద్ధరించడం, క్షీణించిన అవయవాలను బాగుచేయడం వంటి ప్రక్రియలు ఏఐ ద్వారా సాధ్యపడవచ్చని తెలిపారు. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి వ్యాధుల విషయంలో నష్టపోయిన నాడీ కణాలను తిరిగి అభివృద్ధి చేసే మార్గాలు అన్వేషించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, అధునాతన ఏఐ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేని ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా మారవచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తుండగా, ఏఐ పురోగతిని ఆలస్యం చేస్తే వైద్య పరిష్కారాలు అందక ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని బోస్ట్రోమ్ వాదించారు. ప్రాణాంతక వ్యాధికి చేసే అత్యవసర శస్త్రచికిత్సతో ఈ పరిస్థితిని ఆయన పోల్చారు. ఇది కూడ చవండి: చిన్న ఇస్త్రీ షాపు నుంచి లక్షల టర్నోవర్ దాకా..ముంబయి యువకుడి సక్సెస్ స్టోరీ.! ప్రస్తుత వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపే చికిత్స ఇంకా ప్రయోగశాల దశలోనే ఉంది. సెల్యులార్ రీప్రోగ్రామింగ్, సెనోలిటిక్స్ వంటి విధానాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఔషధాల ఆవిష్కరణలో ఏఐ వేగాన్ని పెంచుతున్నప్పటికీ, క్లినికల్ స్థాయిలో దీర్ఘకాలిక ఫలితాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయని శాస్త్రీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ సగటు ఆయుష్షు 73.3 ఏళ్లుగా ఉన్నప్పటికీ, పూర్తి ఆరోగ్యంతో గడిపే కాలం 62.8 ఏళ్లుగానే ఉంది. ఈ నేపథ్యంలో 1,400 ఏళ్ల ఆయుష్షు అనే భావన ప్రస్తుతానికి ఒక సిద్ధాంతపరమైన చర్చగానే నిలుస్తోంది. రాబోయే కాలంలో ఏఐ ఆధారిత బయోటెక్నాలజీ పరిశోధనలు ఏ దిశగా సాగుతాయనే దానిపై శాస్త్రలోకంలో ఆసక్తి నెలకొంది. సాంకేతిక పురోగతితో పాటు నైతిక, ఆరోగ్య భద్రతా ప్రమాణాలపై స్పష్టత వస్తేనే ఈ తరహా అంచనాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణలు ఎందుకంటే.! మీకు నచ్చవచ్చు: తెలంగాణ క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా వేదికగా బలమైన పునాది: సీఎం రేవంత్ [ Nick Bostrom, Superintelligent AI, Anti Aging AI, Human Lifespan 1400 Years, Artificial Intelligence Health, Human Longevity, Anti Aging Research, Life Extension, AI Healthcare ]
http://www.teluguone.com/news/content/nick-bostrom-25-237952.html





