2జిపై పీఎం మంత్రాంగం
Publish Date:Feb 10, 2012
Advertisement
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రం వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉండేందుకు ప్రధాని మన్మోహన్ ఈసారి ఆచితూచి అడుగేస్తున్నారు. స్పెక్ట్రం వేలంలో అనుసరించాల్సిన విధివిధానాలను కూలంకషంగా చర్చించేందుకు శనివారం సీనియర్ మంత్రులతో ప్రధాని భేటీ అవుతున్నారు. సుప్రీం కోర్టు రద్దుచేసిన 122 లైసన్సులను తిరిగి మంజూరు చేసేందుకు అనుసరించాల్సిన నియమాలను పరిశీలించటంతోపాటు, 2008కి ముందు జారీ చేసిన 2జి స్పెక్ట్రం లైసన్సులనూ రద్దు చేయాలా? లేదా? అనేది కూడా శనివారంనాటి భేటీలో పరిశీలిస్తారని తెలుస్తోంది. 2008కి ముందు టాటా, భారతి ఏయిర్ టెల్ సంస్థలకు 2జి స్పెక్ట్రంను ఉచితంగా కేటాయించారు. లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయమంత్రి సల్మాన్ ఖుర్షీద్, టెలికాం, మానవ వనరుల మంత్రి కపిల్ సిబల్ తదితర మంత్రులు భేటీకి హాజరవుతున్నారు. ఎ రాజా టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2008లో ఎనిమిది కంపెనీలకు జారీ చేసిన 122 2జి స్పెక్ట్రం లైసన్సులను సుప్రీం కోర్టు రద్దు చేయటం తెలిసిందే. రాజా పక్షపాతంతో వ్యవహరించారంటూ సుప్రీం కోర్టు 2జి లైసెన్సులను రద్దు చేయటంతో వ్యాపార వాణిజ్య రంగాల్లో గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇదే అంశంపై రెండు మూడు దేశాల రాయబారులు ప్రధాన మంత్రి, కపిల్ సిబల్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. పలు విదేశీ కంపెనీలు సైతం నిరసన వ్యక్తం చేశాయి. రద్దు చేసిన 2జి స్పెక్ట్రం లైసెన్సులను నాలుగు నెలలలోగా తిరిగి కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించటం గమనార్హం. ఈనేపథ్యంలో 2జి స్పెక్ట్రంను తీసుకునే కంపెనీలు అందరికీ ఈసారి సమాన నియమ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీంతోపాటు సుప్రీం కోర్టు తీర్పు మూలంగా లైసెన్స్‌లు కోల్పోయిన విదేశీ కంపెనీల సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా ఈ భేటీలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/newdelhi-24-11800.html





