వెలుగులోకి మరో మహమ్మారి.. ఇరాక్ ను ముంచెత్తుతున్న కాంగో ఫీవర్ వైరస్
Publish Date:May 30, 2022
Advertisement
ఇరాక్ ను కొత్త వైరస్ వణికిస్తోంది. కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ప్రాణాంతకమైనది కావడంతో దీని వ్యాప్తి తీవ్రతపై ఆందోళన వ్యక్తమౌతున్నది. కోవిడ్ వైరస్ ముప్పు పూర్తిగా తొలగకముందే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని గడగడలాడించడంతో వీటిని అరికట్టేదెలా, వైరస్ లకు వ్యాక్తిన్ లు కనుగొనడం, వాటి ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. కోవిడ్ అనంతరం కొత్త కొత్త వేరియంట్లతో మూడు దశలుగా ప్రపంచాన్ని బెంబేలెత్తించిన మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగకపోయినా వ్యాప్తి తీవ్రత నెమ్మదించిందని విశ్వ వ్యాప్తంగా ఒకింత ఊరట వ్యక్తమౌతున్న వేళ ఇరాక్ లో పుట్టుకొచ్చిన కాంగో ఫీవర్ వైరస్ కొత్త భయాలను తీసుకొచ్చింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ ప్రాణాంతకమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ కు ఇప్పటి వరకూ వ్యాక్తిన్ లేదని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా కాంగో ఫీవర్ వైరస్ పై ఆందోళన వ్యక్త మౌతున్నది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇప్పుడు ఇరాక్ ప్రజలను భయం గుప్పిట్లో బిగించేసింది. ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు అధిక రక్తస్రావం అవ్వడంతో మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని డబ్ల్యుహెచ్ వో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాక్ లో ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 20 మంది మృత్యువాత పడ్డారు. దీని వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. దీనిని అరికట్టేందుకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ ఇరాక్ గ్రామీణ ప్రాంతాలలో అధికంగా కనిపిస్తోంది. తొలుత ఒక ఆరోగ్య కార్యకర్త ఈ వైరస్ బారిన పడినట్లు ఇరాక్ వైద్య అధికారులు తెలిపారు. అతడి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని గుర్తించినట్లు తెలిపారు. ఈ వైరస్ ను గుర్తించిన అనంతరం ఆరోగ్య కార్యకర్తలందరికీ పీపీఈ కిట్లు సరఫరా చేసి వాటిని ధరించడం తప్పని సరి చేశారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఈ వైరస్ వాహకాలుగా గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు ఈ వైరస్ సోకుతుందని పేర్కొంది. ఈ వైరస్ వ్యక్తులకు సోకిన తరువాత వారి రక్తం, మలం, చెమట ద్వారా ఇతరలకు వేగంగ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ పట్ల ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
http://www.teluguone.com/news/content/new-virus-spread-in-iraq-who-says-it-is-dangerous-25-136653.html





