కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడంటే...
Publish Date:Dec 30, 2021
Advertisement
ఇంచు మించుగా రెండు సంవత్సరాలకు పైగానే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబందించి ఏదో ఒక విధమైన చర్చ జరుగుతూనే వుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి,ఘోరంగా ఓడి పోయి, రెండంకెల సంఖ్యకే పరిమితం అయిన నేపధ్యంలో అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ కొంతకాలం, తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. ఆ తర్వాత ఆమె తాత్కాలిక తీసేసి, పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు.అయితే వయసు రీత్యా ఆమె క్రియాశీలంగా పార్టీ బాధ్యతలను నిర్వర్తించలేక పోతున్నారు. ఈ నేపధ్యంలోనే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పవురు సీనియర్ నాయకులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అలగే, 23 మంది సీనియర్ నేతలు..జీ 23 గా ఏర్పడి, పార్టీకి పని చేసే అధ్యక్షుడు కావాలాని సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటకు పొక్కింది.అనంతరం, పలుమార్లు సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఎన్నికలు నిర్వహించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించినప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, కొత్త సంవత్సరం నేపధ్యంగా మళ్ళీ మరోమారు, సంస్థాగత ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది. ఈనేపధ్యంలో పార్టీ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి పార్టీకి నూతన అధ్యక్షుడు వస్తాడని ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఎప్పటిలానే నియమిస్తారా? అనేది ఇంకా స్పష్టం కావలసి వుంది. అలాగే, ఇప్పటికే అనధికార అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ, మరోమారు అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా లేక మళ్ళీ కథ మొదటికి వస్తుందా ..అనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 2022 మార్చి 1 నాటికి ఇది పూర్తవుతుంది. మార్చి తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రాథమిక స్థాయినుంచి ఎన్నికలు మొదలవుతాయి. అధ్యక్ష పదవికి ఎన్నికలు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయి. అక్టోబర్ 1కి పార్టీకి నూతన అధ్యక్షుడు వస్తారు, అని మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.
http://www.teluguone.com/news/content/new-president-for-congress-party-39-129344.html





