టీజీ, ఏపీ… 2026 దాకా ఆగాల్సిందే అంటోన్న మోదీ సర్కార్!
Publish Date:Aug 2, 2017
Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల నెత్తిన కేంద్రం మరో బాంబు వేసింది. రాష్ట్రాలు కాకపోయినా కనీసం ఇరు రాష్ట్రాల అధికార పక్షం నేతలకు మాత్రం నిరాశ మిగిల్చింది! ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ఇద్దరూ కోరుకుంటున్న అసెంబ్లీ సీట్ల పెంపుకు క్లియర్ గా నో చెప్పేసింది! దాదాపు అయిపోయినట్టే అన్నట్లుగా వుండింది కొన్నాళ్ల కింద పరిస్థితి. ప్రధాని కార్యాలయం దాకా వెళ్లింది ఫైలు. అయినా మోదీ సర్కార్ చివరాఖరుకు నో చెప్పేసింది కేసీఆర్, చంద్రబాబు అభ్యర్థనకు! ఎన్డీఏలో భాగస్వామిగా వున్న టీడీపీ ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలనుకుంటోంది. అందుకే, బాబు అనేక సార్లు దిల్లీలో ప్రస్తావన తెచ్చారు. ఇక ఎన్డీఏలో లేకున్నా మోదీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తోన్న కేసీఆర్ కూడా పదే పదే నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడారు. ఈ మధ్య దిల్లీలో పర్యటించిన కేసీఆర్ అసెంబ్లీ సీట్ల పెంపు వుండదని తేల్చి చెప్పేశారు. అదే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ చెప్పారు! టీడీపీ ఎంపీ మురళీమోహన్ ప్రశ్నకు బదులుగానే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుకు … 2026దాకా నో ఛాన్స్ అన్నారు! కేంద్రం ఎమ్మెల్యేల సంఖ్య పెంచకపోవటానికి ప్రధాన కారణం ఆర్టికల్ 170(3) సవరించాల్సి వుండటమే. ఈ పని జరగాలంటే పార్లమెంట్లో చాలా పార్టీల మద్దతు కూడగట్టాలి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడు కాక ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల గురించి ఎమ్మెల్యేల సంఖ్య పెంచటం అనేక రాజకీయ గందరగోళాలకి దారి తీసే ఛాన్స్ కూడా వుంది. ఒరిస్సా, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా నియోజకవర్గాలు పెంచమని కోరుతున్నాయి. అవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల డిమాండ్ కు తలొగ్గితే తమ ఒత్తిడి కూడా పెంచవచ్చు. అంతే కాక బీజేపి తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుపై ఆసక్తి చూపకపోవటానికి రాజకీయ కారణం కూడా వుంది… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సీట్లు పెంచితే టీఆర్ఎస్, టీడీపీలకు లాభమని వాదన వినిపిస్తోంది. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల సీట్ల కోసం ఇతర పార్టీల్లోని బలమైన నేతలు అధికార పార్టీల్లోకి జంప్ చేసే ఛాన్సెస్ వున్నాయి. కాని, బీజేపికి ప్రత్యేకంగా లాభమంటూ లేదని గతంలో అమిత్ షా తెలంగాణ టూర్ అప్పుడు కొందరు నేతలు చెప్పారట. టీడీపీతో పొత్తు వున్న ఏపీ కాకపోయినా… తెలంగాణలో టీఆర్ఎస్ కు మేలు చేసే నిర్ణయం తామెందుకు తీసుకోవాలని బీజేపి పెద్దలు భావించి వుంటారు. అదీ కాక ఉభయ సభల్లో చాలా పార్టీల్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయటం… ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక శ్రమగా కేంద్రం భావించి వుండవచ్చు! మొత్తం మీద… నియోజకవర్గాల పెంపు ఆశలు గల్లంతు కావటంతో… తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ ఆశావహుల కలలు గల్లంతైనట్టే చెప్పుకోవచ్చు!
http://www.teluguone.com/news/content/narendra-modi-45-76743.html





