ఆర్మీ చేతిలో హతమైన అబు దుజానా ఎవరో మీకు తెలుసా ?
Publish Date:Aug 2, 2017
Advertisement
భారత ఆర్మీ తమపై రాళ్లు విసురుతోన్న అరాచకులకి బుల్లెట్లతో సమాధానం ఇస్తోంది. తాజాగా లష్కర్ కమాండర్ అబు దుజానా పని పట్టింది. ఎన్నో సార్లు తప్పించుకుని తిరిగిన ఈ క్రూరమైన ఉగ్రవాది ఎట్టకేలకు నేలకూలాడు. అయితే, ఆర్మీ దృష్టిలో పెట్టుకున్న పన్నెండు మంది టాప్ టెర్రరిస్టుల్లో దుజానా మూడో వాడు. ఇతడ్ని హతం చేయటం చాలా పెద్ద విజయమేనంటోంది ఆర్మీ. అందుకు కారణం తెలియాలంటే అబు దుజానా ఎవరో తెలుసుకోవాల్సిందే… 1. అబు దుజానాగా పేరు మోసిన లష్కర్ ఉగ్రవాది అసలు పేరు హఫీజ్. ఇతను అత్యంత ఎక్కువ కాలం కాశ్మీర్లో తిష్ఠవేయగలిగిన విదేశీ జిహాదీ అని చెప్పవచ్చు. అనేక దాడుల్లో, ప్రధానంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ టార్గెట్ గా జరిగిన వాటికి దుజానా కారణం… 2. 27ఏళ్ల దుజానా మోస్ట్ వాంటెడ్. అతడి మీద 15లక్షల నగదు బహుమానం కూడా ప్రకటించింది ఆర్మీ. ఏ++ క్యాటగిరి టెర్రరిస్ట్ గా పేర్కొన్న దుజానా 2016లో పుల్వామాలో జరిగిన దాడికి కారకుడు. అందులో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ అధికారులు చనిపోయారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు… 3. లష్కరే తోయ్యబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన హపీజ్ సయిద్ కు దుజానా అత్యంత ఆప్తుడు. పాక్ ఆక్రమిత కాశ్మర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన ఇతను వివిధ ఉగ్రవాద సంస్థల్ని ఒక్క చోటకి తెచ్చి భారత్ మీద మరింత సమర్థవంతమైన దాడులు చేయించే పని చేసేవాడు. అయితే, ఎల్ఈటీతో గత కొంతకాలంగా దుజానాకు పడటం లేదు. అందుకే, లష్కరే బోయ్యబా అతడ్ని పదవిలోంచి తొలగించి ఆయుధాలు లాగేసుకుంది… 4. లష్కర్ నుంచి విడిపోయాక జకీర్ మూసా అనే ఉగ్రవాదితో చేతులు కలిపాడు అబు దుజానా. జకీర్ మూసా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. అతడు కూడా తన అతివాద జిహాదీ సిద్ధాంతాల కారణంగా తన సంస్థ నుంచి విడిపోయాడు. 5. పోయిన సంవత్సరం నుంచీ మన ఆర్మీ చేతిలో చచ్చిన అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదుల్లో దుజానా మూడో వాడు. బుర్హాన్ వనీ, సబ్జార్ భట్ల తరువాతి స్థానం దుజానాదే! 6. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత తనని తాను కాశ్మీరీ ఉగ్రవాద హీరోగా ప్రమోట్ చేసుకున్నాడు దుజానా. మరీ ముఖ్యంగా, ఇతను సోషల్ మీడియా ఎక్స్ పర్ట్! వాట్సప్ గ్రూపుల్ని అడ్డుపెట్టుకుని రాళ్లు రువ్వు అరాచకవాదుల్ని పోగయేటం దుజానా ప్రత్యేకత! 7. 2014లో మొదటి సారి కెమెరాకు చిక్కిన దుజానా… బుర్హాన్ వనీ అంత్యక్రియల తరువాత నుంచీ ఆర్మీ, నిఘా వర్గాల హిట్ లిస్ట్ లో వున్నాడు. 8. ఇప్పటికి అయిదు సార్లు ఎన్ కౌంటర్ కాబోయి తప్పించుకున్న అబు దుజానా గత మే నెలలో కూడా తప్పించుకున్నాడు. విపరీతంగా రాళ్లు రువ్విన కాశ్మీరీ యువత దుజానా తప్పించుకోటానికి సహకరించింది. కాని, మేలో పుల్వామాలోని హకీపురాలో ఎక్కడైతే తప్పించుకున్నాడో… అదే చోట మంగళవారం నాడు దుజానాను ఎన్ కౌంటర్ చేసింది మన ఆర్మి! 9. లష్కరే తొయ్యబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల నుంచీ ఆర్మీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో వున్న మొత్తం పన్నెండు మందిలో అబు దుజానా ఒకడు. బుర్హాన్ వనీ , సబ్జార్ భట్ తరువాత ఇతడి గురించే ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. ఎన్ కౌంటర్ తో జవాన్లు, నిఘా వర్గాల శ్రమ ఫలించింది! 10. అబు దుజానా ఎన్ కౌంటర్ తో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 102మంది ఉగ్రవాదులు హతమైనట్టైంది! జనవరి – జూలై మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని చంపటం 2010తరువాత ఇదే మొదటిసారి!
http://www.teluguone.com/news/content/lashkar-commander-abu-dujana-45-76744.html





