360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్!
Publish Date:Mar 7, 2025
Advertisement
మంత్రి నారా లోకేష్. అన్ని రకాలుగా రాటుతేలుతున్నట్టే కన్పిస్తోంది. నెమ్మదిగా విషయాలను అవగాహన చేసుకోవడంతోపాటు.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. రాజకీయంగా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టే కన్పిస్తోంది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా వ్యవహరించిన లోకేషుకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి లోకేషుకు చాలా వ్యత్యాసం, పరిణితి కన్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లోకేషులో అంతకు మించిన పరిణితి కన్పిస్తోంది. పార్టీ కార్యకర్తలతో వ్యవహరించే తీరు.. అసెంబ్లీలో ప్రతిపక్షంతో వ్యవహరిస్తోన్న తీరు.. లీడర్లను కంట్రోల్లో పెడుతున్న తీరుతో పాటు.. మిత్రపక్షాలతో ఎలా మెలగాలి అనే అంశం మీద కూడా లోకేష్ చాలా మెచ్యూర్డుగా ఆలోచన చేస్తున్నారు. వివిధ వేదికల మీద.. వివిధ సందర్భాల్లో నారా లోకేష్ వ్యవహరించిన తీరే.. ఆయనలో వచ్చిన పరిణితిని కనబడేలా చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే.. లోకేష్ పరిణితి ఏ స్థాయిలో సాధించాడో అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రజా విజయం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి నినాదాలు చేస్తున్నారు. దీంతో రాజా సీరియస్ అయ్యారు. కూర్చొ అంటూ సదురు కార్యకర్తను కొంచెం దురుసుగానే మాట్లాడారు. దీంతో సభకు హాజరైన వారికి కానీ.. టీవీల్లో చూస్తున్న వారికి కానీ కొంచెం తేడాగా అనిపించేలా ఉంది. గెలిచిన తర్వాత ఆలపాటి రాజాలో అహంకారం కన్పిస్తోందనే తీరులో ఆలపాటి రాజా హవాభావాలు ఉన్నాయి. దీన్ని వేదిక మీదే కూర్చొన్న లోకేష్ పసిగట్టారు. వెంటనే ఆయన తన సీట్లో నుంచి లేచి రాజా దగ్గరకు వచ్చారు.. కూర్చొమంటే కూర్చుంటామా..? తగ్గేదేలే.. అంటూ వాతావరణాన్ని చల్లబర్చారు.. అంతే కాకుండా.. హెడ్మాస్టరులా చెబితే వింటామా..? అంటూ నవ్వుతూనే ఆలపాటి రాజాకూ చురక వేశారు. ఇక సభలో శాసన మండలిలో ప్రతిపక్షం మీద చాలా ఎగ్రెసివ్ గా వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని సభలో ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచించడమే కాకుండా.. తన తోటి సభ్యులకు స్పూర్తినిచ్చేలా వ్యవహరిస్తున్నారు. బొత్స లాంటి సీనియర్ పొలిటిషీయన్ను వివిధ సందర్భాల్లో కార్నర్ చేస్తున్నారు లోకేష్. అలాగే తన వాళ్ల బాగోగులను చూసుకుంటున్నారు. నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే సభకు వచ్చేశారు. సభకు రావద్దు.. వెళ్లి రెస్ట్ తీసుకోండంటూ.. లాబీల్లో మంత్రి నిమ్మలకు సూచించడమే కాకుండా.. సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి.. మంత్రి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. మంత్రి నిమ్మల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో చూడండనే విషయాన్ని ఇతర మంత్రులకు.. సభ్యులకు అర్థమయ్యేలా చేశారు లోకేష్. ఓ మంత్రి ఆరోగ్యం గురించి ఈ తరహాలో సభలో ప్రస్తావన రావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి అనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. ఇంతే కాదు.. మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో లోకేష్ విపరీతమైన మెచ్యూర్డ్ ప్రదర్శిస్తున్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేస్తే.. జనసేన నేతలకంటే ముందుగా స్పందించి.. కౌంటర్ ఇచ్చింది లోకేషే. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిక కూడా చేశారు పవన్. చంద్రబాబుకు.. పవనుకు ఎలాంటి గ్యాప్ లేదు.. కానీ పవనుకు, లోకేషుకు మధ్య గ్యాప్ వస్తుందేమోననే చర్చ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అలాంటి అనుమానాలు అవసరం లేదనే రీతిలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే.. అందరికంటే ముందుగా లోకేష్ స్పందించిన తీరు కూటమి వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ.. చాలా తక్కువ సమయంలో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరును లోకేష్ తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/naralokesh-matured-politician-39-194029.html





