రేపే మేడారం మహా జాతర... భారీగా ఏర్పాట్లు
Publish Date:Jan 13, 2026
Advertisement
మేడారం మహా జాతరకు తొలి ఘట్టం రేపు జరగనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలిగే (శుద్ది పండుగ) క్రతువును పూజారులు నిర్వహించనున్నారు. పూజారులు తమ ఇళ్లతో పాటు మేడారంలోని వనదేవతల గద్దెలను శుద్ది చేస్తారు. అనంతరం అడవికి వెళ్లి గుట్ట,పుట్ట మట్టిని సేకరించి, గద్దెలకు చేరుకోని అలుకుపూతలు నిర్వహిస్తారు. దీంతో జాతర మొదలైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మేడరం భక్తుల కోసం "MyMedaram" పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మేసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చును. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. మరోవైపు జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని సీతక్క వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/mymedaram-36-212485.html




