చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు..
Publish Date:Dec 29, 2021
Advertisement
పార్లమెంట్ అంటే ఆ దేశానికి అత్యున్నత చట్టసభ. పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, చట్టాలు చేయడానికి వేదిక. పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. పరస్పర విమర్శలు.. సవాళ్లు కూడా ఉంటాయి. ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు చేస్తుంటాయి. అయితే పార్లమెంట్ లో జరిగే చర్చలు హుందాగా ఉండాలని జనాలు కోరుకుంటారు. కాని అక్కడ ప్రజా ప్రతినిధులే రెచ్చిపోయారు. గౌరవరప్రదమైన పదవుల్లో ఉన్నామని మర్చిపోయి, విచక్షణ మరిచి చిల్లరగా వ్యవహరించారు. జోర్డాన్ పార్లమెంట్లో ఎంపీలు కొట్టుకున్నారు. ఓ అంశంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు పరస్పర దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రతిపక్ష ఎంపీ మాట్లాడుతూ.. ఈ బిల్లు పనికిరానిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సదరు సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు ఎంపీలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇదంతా అక్కడి మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. ఎంపీల బాహాబాహీతో సభ వాయిదా పడింది. ఎంపీల కొట్లాటకు సంబంధించిన దృశ్యాలను కొందరు మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరలయ్యాయి. అయితే ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి.
http://www.teluguone.com/news/content/mps-fighting-in-parliament-39-129256.html





