ఆస్తులు పెరుగుదల అంటే వైసీపీ ఎంపీలదే!
Publish Date:Jan 8, 2026
Advertisement
టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు. కానీ, వారి వారి ఆస్తుల్లో మాత్రం భారీ పెరుగుదల ఉన్నట్టు కనిపించింది. వీరిలో టాప్ ఎవరు? బాటమ్ లో ఎవరున్నారని చూస్తే.. వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 మధ్య కాలం వరకూ తన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. వాటి ప్రకారం చూస్తే 2014లో ఆయన పోటీ చేసినపుడు ఆస్తుల విలువ రూ. 22. 59 కోట్లు కాగా.. 2024 ఎన్నికల నాటికి వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. రూ. 146. 85 కోట్లకు చేరుకుంది. అంటే ఈ పదేళ్ల కాలంలో మిథున్ రెడ్డి ఆస్తి రూ. 124. 25 కోట్ల వరకూ పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్ దేశంలోనే థార్డ్ ప్లేస్ లో నిలిచారు. 2014 నుంచి 19 వరకూ మిథున్ ఆస్తుల విలువ రూ. 44 కోట్లు పెరగగా.. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో రూ. 80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రూ. 47. 54 కోట్ల చరాస్తులు రూ. 99. 30 కోట్లు స్థిరాస్తులున్నాయి. అదే సమయంలో 56. 09 కోట్ల వరకూ అప్పులు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో సమర్పించారు. మొత్తానికి ఈ పదేళ్లలో మిథున్ రెడ్డి ఆస్తులు సుమారు 550 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకూ లోక్ సభ ఎన్నికల మధ్య తిరిగి ఎంపికైన ఎంపీల ఆస్తుల వివరాల విశ్లేషణ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దీని ప్రకారం చూస్తే.. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఒకరు. అవినాష్ ఆస్తులు 2014లో రూ. 7 కోట్ల మేర ఉండేవి. అదే 2019 నాటికి రూ. 18 కోట్లకు పెరిగాయి. ఇక 2024 నాటికి ఈ ఆస్తుల విలువ రూ. 40 కోట్లకు చేరాయి. ఆస్తుల వృద్ధి పరంగా చూస్తే ఈయన 15వ స్థానంలో ఉన్నారు. ఇక అవినాష్‌రెడ్డి ఆస్తుల పెరుగుదల శాతం 474గా ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలోనే ఎంపీల ఆస్తుల శాతంలో టాప్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా 804 శాతంతో టాప్ లో ఉండగా.. 532 శాతంతో రెండో స్థానంలో ఉన్న పార్టీ వైసీపీ. ఎంఐఎం పార్టీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు ఈ పదేళ్లలో 488 శాతం పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల ప్రకారం- 24వ స్థానంలో నిలిచారు అసద్. టీడీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఆస్తుల పెరుగుదల ఎలా ఉందో చూస్తే- 177 శాతం మేర పెరిగాయి. ఆస్తుల పెరుగుదల జాబితాలో రామ్మోహన్ 28వ స్థానంలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ పదేళ్లలో సగటున 110 శాతం పెరగ్గా, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వచ్చిన ఆయన ఆస్తి 2014లో 74. 47 కోట్లుండగా 2019 నాటికది రూ. 44. 06 కోట్లకు, 2024 నాటికి రూ. 39. 49 కోట్లకు పడిపోయింది. పదేళ్లలో ఆయన ఆస్తి 47 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ADR రిపోర్ట్ ప్రకారం గత మూడు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 108 శాతం పెరగ్గా.. కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135 శాతం వృద్ధి చెందాయి. రాహుల్ ఆస్తుల విషయం చూస్తే.. రూ. 10. 99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో రూ. 9. 40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019 నాటికి రూ. 15. 88 కోట్లు పెరిగాయి. ఇవే ఆస్తులు 2024 నాటికి రూ. 20. 39 కోట్లకు చేరాయి. ఈ మొత్తం శాతంలో చూస్తే 117 పర్సెంట్ హైక్ కనిపించింది. ఆస్తులు పెరిగిన ఎంపీల లిస్టులో రాహుల్ 38వ స్థానంలో నిలిచారు. ఇక ప్రధాని మోడీ ఆస్తులు 82 శాతం మేర పెరిగినట్టు కనిపించింది. 2019లో రూ. 1. 65 కోట్లున్న మోడీ ఆస్తుల విలువ 2019నాటికది రూ. 2. 15 కోట్లకు, 2024నాటికది రూ. 3. 02 కోట్లకు పెరిగాయి. ఆస్తులు పెరిగిన ఎంపీల్లో మోడీ 94 వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తుల విలువ పెరిగిన టాప్ టెన్ ఎంపీల్లో ఐదుగురు బీజేపీ వారే ఉండటం గమనార్హం.
http://www.teluguone.com/news/content/mp-mithun-reddy-36-212218.html





