పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడే ' ఆ ప్రత్యేక ప్రకటన ' రానుందా?
Publish Date:Aug 31, 2016
Advertisement
ప్రత్యేక హోదా... తెలంగాణ, ఆంధ్రా విడిపోయాక అత్యంత వివాదాస్పదమైన పదాల్లో ఇదొక్కటిగా చేరిపోయింది! రాజకీయ నాయకులతో పాటూ శివాజీ, పవన్ కళ్యాణ్ లాంటి నటులు కూడా ప్రత్యేక హోదా అంటూ నానా రభసకి కారణమైపోయారు. అటు ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా సెంటిమెంట్ అంతకంతకి పెరిగిపోతోంది. హైద్రాబాద్ తో సహా తెలంగాణని విడదీశాక ఆంధ్రకి అన్యాయం జరిగిందన్న భావం జనాల్లో విపరీతంగా వుంది. అది ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో మరింతగా పెరిగిపోయింది. చివరకు, అటు పోయి ఇటు పోయి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. ఎందుకంటే, నవ్యాంధ్రకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే... అది కేంద్ర ప్రభుత్వానికే సాధ్యం. ఇవ్వకుండా నాన్చుతోంది కూదా మోదీ సర్కారే! అందుకే, మొన్న తిరుపతి సభలో కాషాయ పార్టీకి కషాయం తాగించాడు పవన్ కళ్యాణ్! భాగస్వామ్య దర్మంతో టీడీపీ పెద్దగా విమర్శలు చేయకున్నా పవర్ స్టార్ మాత్రం కమలదళాన్ని ఉతికి ఆరేశాడు. అయినా కూడా ఆశ్చర్యకరంగా పవన్ కు బీజేపి నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు!
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి కేవలం బీజేపిని, మోదీ సర్కార్ నే టార్గెట్ చేసినా కూడా ఆ పార్టీ నాయకులు ఆయన్ని ఏమీ అనకపోవటానికి కారణం... త్వరలో రానున్న ప్రకటనే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి కొద్ది రోజుల్లో, అంటే సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఓ కీలక ప్రకటన చేయనుందని సమాచారం. అందులో ఏం వుండాలి, ఏం వుండకూడదు అనే చర్చ కూడా ఇప్పటికే జరిగిపోయిందట. అమిత్ షా, అరుణ్ జైట్లీ నేతృత్వంలో పలు మీటింగ్ లు జరిగాయి ఢిల్లీలో. పవన్ కళ్యాణ్ చేత నానా మాటలు పడ్డ వెంకయ్య నాయుడు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర వహించారట! ప్రత్యేక హోదా అన్న పదం మాత్రం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని లాభాలు చూకూరేలా ప్రకటన చేయాల్సిందిగా వెంకయ్య కేంద్ర ఆర్దిక మంత్రికి చెప్పారట. అలాగే బీజేపి ప్రెసిడెంట్ అమిత్ షా కూడా ఇక ప్రకటన చేయాల్సిన టైం వచ్చిందనే భావనతోనే వున్నారట. ఎందుకంటే, ప్రత్యేక హోదా వాయిదా వేసినంత కాలం తెలుగు ప్రజల్లో బీజేపికి నెగటివ్ మార్కులే పడుతుంటాయని ఆయన గ్రహించారంటున్నారు....
అంతా అనుకున్నట్టే జరిగితే సెప్టెంబర్ 3 న ప్రధాని విదేశీ యాత్రకు బయలుదేరే ముందే ఓ సెప్టెంబర్ 2 న ఓ ప్రకటన వెలువడుతుందట! ఆ రోజే పవన్ కళ్యాణ్ బర్త్ డే కూడా! అంటే.... పవన్ పుట్టిన రోజు నాడే కేంద్రం ఆంధ్రాపై వరాలు వర్షం కురిపించనుందన్నమాట! ఒకవేళ ప్రకటన వార్త నిజమే అయితే మాత్రం.... జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయన పుట్టిన రోజున వచ్చే కీలక ప్రకటనతో 'పండగ' చేసుకుంటారు! వాళ్ల సంగతి ఎలా వున్నా మంచి ప్రకటన వస్తే మాత్రం తెలుగు ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు....
http://www.teluguone.com/news/content/modi-special-status-approval-pawan-kalyan-birthday-45-65869.html





