గోవిందా.. గోవిందా.. అమ్మకానికి తిరుపతి విమానాశ్రయం!
Publish Date:Sep 9, 2021
Advertisement
తిరుమల.. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతి విమానాశ్రయం నిర్మించారు. దేశంలోని టాప్ విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఇది ఒకటి. అయితే ప్రైవేటీకరణ జపం చేస్తున్న మోడీ సర్కార్ ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేట్లకు దక్కబోతోంది. కేంద్ర సర్కార్ ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా తాజాగా తిరుపతి ఎయిర్ పోర్టును అమ్మకానికి పెట్టాలని కేంద్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది. నిధులను భారీ ఎత్తున సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. వివిద శాఖల్లోని సంస్థలు ఈ జాబితా ఉన్నాయి. తాజాగా ఇందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నాటికి 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు అంగీకరించింది. ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నాయి. వీటిని కలిపేసి మరింత పెద్ద విమనాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నారు. ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉండగా, ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి. వారణాసి విమానాశ్రయంలో కుషినగర్, గయను కలిపేయనుండగా, అమృత్‌సర్‌లో కంగ్రాను, భువనేశ్వర్‌ను తిరుపతితో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్తోను, ఇండోర్‌ను జబల్పూర్తోను, తిరుచ్చిని హుబ్లీతో కలిపేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా ఏఏఐ అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది. వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు కావడంతోపాటు వారణాసి పవిత్ర పుణ్యస్థలం కావడం మరో కారణం. మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3,700 కోట్లు ప్రైవేటు పెట్టబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న విమానాశ్రయాలను పెద్దవాటితో కలపడం దేశంలో ఇదే తొలిసారి కానుంది. పీపీఈ మోడ్‌లో ఆదాయ పంపకాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓనర్షిప్ మాత్రం ప్రభుత్వానిదే. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను పీపీపీ మోడ్‌లోనే అభివృద్ధి చేశారు. జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను త్వరలోనే స్వాధీనం చేసుకోనున్న అదానీ గ్రూప్.. నవీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఇవన్నీ ఇప్పటికే స్వతంత్ర ప్రాతిపదికన ప్రైవేటీకరణ పూర్తిచేసుకున్నాయి. అయితే హిందువుల పవిత్ర క్షేత్రంగా చెప్పుకునే తిరుపతి విమానాశ్రయాన్ని.. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
http://www.teluguone.com/news/content/modi-govt-planing-to-sale-tirupathi-airport-39-122765.html





