29న మోడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?.. నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ లకు ఉద్వాసన?
Publish Date:Jun 26, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారా? కేవలం మార్పులు, చేర్పులే కాకుండా.. మోడీ కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అంటే ఎన్డీయే వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ క్యాబినెట్ దాదాపు మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల మంత్రులు సుదీర్ఘ కాలంగా అవే శాఖలలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కీలక శాఖల మంత్రులను మార్చాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులపై క్షేత్రస్థాయిలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగానే మోడీ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముర్ముతో భేటీలో అమిత్ షా కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించిన సమాచారాన్నిఆమెకు వివరించినట్లు ఎన్డీయే వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదలా ఉంటే.. ఈ కేబినెట్ ప్రక్షాళనలో విత్త, విద్యా శాఖ మంత్రులకు ఉద్వాసన లేదా స్థాన చలనం తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరిలో నిర్మలాసీతారామన్ గత పదేళ్లుగా దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ పై ఇటీవలి నీట్ పేపర్ లీక్ తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కాక్రోచ్ జనతాపార్టీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఏకైక ఎజెండా, డిమాండ్ తో దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. అదీ కాకుండా.. నీట్ పేపర్ లీక్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడంతో.. ఆయనకు ఉద్వానస పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన కాకుండా, ఆమె శాఖను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ కు మానవవనరులు లేదా మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాల భోగట్టా. వీరే కాకుండా మరి కొందరు మంత్రులకు కూడా శాఖల మార్పు లేదా ఉద్వాసన ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం నురంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
http://www.teluguone.com/news/content/modi-cabinet-reshuffle-on-the-29th-25-224219.html




