ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.!
Publish Date:Nov 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 3,880 పంచాయతీల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ విడతలో మొత్తం 3,803 సర్పంచ్ పదవులతో పాటు 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 83.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 42.46 లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 41.05 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాలు పూర్తయ్యాయి. 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సాయంత్రానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 37,019 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అయితే, రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం. బ్యాలెట్ బాక్సులో ఇంకు, నీళ్లు పోయడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా అక్కడ దాదాపు రెండున్నర గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు, అనంతపురం జిల్లా యల్లనూరులోనూ పోలింగ్ వేళ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఏజెంట్లపై మూకుమ్మడిగా దాడి చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ కేంద్రం ఆవరణలో రాళ్లు రువ్వడంతో పది మంది టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.మొత్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. గ్రామస్థాయి పాలనపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఫలితాలు రాష్ట్రంలోని స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.! [ AP Panchayat Elections, Second Phase Polling, AP Panchayat Elections, Sarpanch Elections, Vote Counting, Prakasam District, Anantapur District, State Election Commission ]
http://www.teluguone.com/news/content/ap-panchayat-elections-25-238167.html





