ఈ నెలలోనే మోడీ ఏపీ పర్యటన.. ఎందుకో తెలుసా?
Publish Date:Mar 4, 2025
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కేంద్రంలో వరుసగా మూడో సారి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచీ ప్రధాని ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం అండ అవసరం కావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ పట్ల ఒకింత ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఒక సారి విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ మరోసారి ఈ నెల రెండో వారంలో అంటే మార్చి 2 వారంలో మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతులకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మోడీ పర్యటన గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోడలో నిర్మించనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం వచ్చే ఐదేళ్లలో కేంద్రం 15 వేల నుంచి 20 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నది. పైగా క్షిపణి ప్రయోగ కేంద్రం రక్షణ మంత్రిత్వశాఖకు అత్యంత కీలకమైనది. దీంతో ప్రధాని మోడీ క్షిపణి పరిశోధనా కేంద్రం ఏర్పాటునకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రం కేంద్రం ఏర్పాటుకు గుల్లలమోడ ప్రాంతాన్ని ఎంపిక చేయడమన్నది 2011లోనే జరిగింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ తెలుగుదేశం హయాంలో అంటే 2017లో పూర్తయ్యింది. . అయితే ఆ తరువాత పనుల పురోగతిలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరగానే పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపింది. క్షిపణి పరీక్షా కేంద్రానికి తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని మోడీ అన్నారు. దీంతో ఇందు కోసం ఆయన ఈ నెల రెండో వారంలో రాష్ట్రపర్యటనకు రానున్నారు. మోడీ పర్యటన తేదీ అయితే ఇంకా ఖరారు కాలేదు కానీ రెండో వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రధాని కార్యాలయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/modi-andhra-pradesh-tour-this-month-39-193829.html





