వైసీపీ నుంచి వలసలు.. టీడీపీలోకి బారులు బారులు?!
Publish Date:Dec 11, 2023
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. జగన్ పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే అనేక మంది వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ టచ్ లోకి వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికలు ఎప్పుడనేది ఇతమిథ్దంగా తేలితే, ఫిరాయింపులు జోరందుకోవడం ఖాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అన్ని రోడ్లూ రోమ్ వైపే అన్నట్లుగా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారందరి చూపూ తెలుగుదేశం వైపే అన్నట్లుగా ఉంది. అయితే కొత్త వారి చేరికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా,కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. . అందుకే పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే, అనేక జిల్లాల్లో వైసీపీకి కొందరు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, చంద్రబాబు నాయుడు తొందరపడడం లేదని అంటున్నారు. ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అవకాశం ఉంటుందా? ఉండదా అన్న మీమాంసకు కూడా స్వస్తి చెప్పి వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చేయడానికి ఇసుమంతైనా సందేహించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ లు వైసీపీకి కటీఫ్ చెప్పేడయాన్ని పరిశీలకులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇంకా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు వంటి వారు తెలుగుదేశం ఎప్పుడు తలుపుతెరుస్తుందా అ ని వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ అసంతృప్తులు తెలుగుదేశం తలుపు తట్టేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ సొంత గడ్డ ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం గూటికి చేరేందుకు పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి ద్వారా వారు చంద్రబాబుకు టచ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కారణంగానే బీటెక్ రవిపై జగన్ పోలీసులను ప్రయోగించారని కూడా జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
అయితే వైసీపీ ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం పాలనా వైఫల్యాలతో పాటు జగన్ వ్యవహారశైలి కూడా కారణమని అంటున్నారు. జగన్ తీరు కారణంగానే బంధువులు, సన్నిహితులు కూడా ఆయనకు, పార్టీకి దూరమౌతున్నారని, గతంలో ఆయన కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడిన వారంతా ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. అన్నిటికీ మించి జగన్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత తమనూ ముంచేస్తుందన్న భయంతో ముందుగానే చేతులెత్తేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే పరిస్థితి ఇలా ఉందంటే.. ముందుముందు ఇంకెలా ఉంటుందో ఊహకు అందనిదేమీ కాదని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/mlas-leaving-ycp-25-166849.html





