మంత్రులు, ఎమ్మెల్యేలు బొమ్మల కొలువులో బొమ్మలే !
Publish Date:Jun 5, 2023
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఏమ్మేల్యేలున్నారు.. అందులో అధికార వైసీపీ ఎమ్మెల్యేలే 151 మంది ఉన్నారు ..మళ్ళీ అందులో ఓ పాతిక మంది వరకు మంత్రులు. వారిలో మళ్ళీ ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరు గాక సలహాదారులు ఇలా పేరు గొప్ప పదవుల్లో ఎందరున్నా, అందరూ జీరోలే. ఎవరికీ ఏ అధికారం లేదు. ఈ మాటన్నది, ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు, మాజీ మంత్రి, అదే అధికార పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. అంతే కాదు అయన ఇంకోమాట కూడా అన్నారు. చివరికి గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేకు లేదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదొక్కటే అని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ కూడా వైసీపీ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. అలాగే ఓ వంక తమ ప్రభుత్వం నాలుగేళ్ళలో ఏవో అద్భుతాలు చేశామని చెప్పుకుంటుంటే, మరో వంక అదే పార్టీకి చెందిన బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నాలుగేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆరోపిస్తున్నారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని విమర్శించారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించటానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని ఆనం రాంనారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టును నిలిపేసి.. చివరికి, కట్టలేమనే దుస్థితికి వచ్చారన్నారు. రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులను అమ్ముకునే పరిస్థితికి తీకొచ్చారని ఫైరయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రామనారాయణరెడ్డి అన్నారు. ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా తెస్తున్నారని.. ఆ లెక్కన రాష్ట్రానికి ఎంత అప్పు అయ్యుంటుందని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్ట్‌లు అమ్మేసే స్ధితికి వచ్చారని.. పోలవరం నిర్మాణాన్ని పక్కనబెట్టారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారని.. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని, జాలి పడుతున్నారని ఆనం రామ నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఇవాళ లే ఔట్లు లేవని.. తెలంగాణలో వ్యాపారాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అమరావతి పేరుతో ఏపీకి వచ్చిన వాళ్లంతా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఆనం రాం నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి నిర్వీర్యమైన పరిపాలనను ఎప్పుడూ చూడలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా స్థాయి సమావేశాలకు విలువే లేదని పేర్కొన్నారు.
నిజమే కావచ్చు ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడిన నేపధ్యంలో అసమ్మతి గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ నాయకుల చేస్తున్న ప్రత్యారోపణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చు. కానీ, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అంతా ఉత్సవ విగ్రహాలు మాత్రమే అనే అభిప్రాయమే వైసీపీ నేతలతో సహా అందరిలో ఉందనేది కాదన లేని నిఖార్సైన నిజం.
http://www.teluguone.com/news/content/ministers-mlas-ceremonial-idols-25-156353.html