మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!
Publish Date:Oct 18, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం లేని సమస్యను సృష్టించి, రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మరో ప్రాంతీయ వాదానికి తెర తీసే కుట్ర చేస్తున్నారా? అనే సందేహం వచ్చేలా, ప్రభుత్వ చర్యలుతున్నాయి. అఫ్కోర్స్ ప్రభుత్వ నిర్ణయం వెనక అస్మదీయుల ఆర్థిక ప్రయోజానాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే వైసీపీ విశాఖలో జేఏసీ పేరున గర్జన సభ నిర్వహించింది. నిజమే ఏ పేరున జరిగినా అది వైసీపీ స్పాన్సర్డ్ షో, కిరాయి ఆందోళన అనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అస్మదీయులు వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే వైసీపీ రాజకీయ వ్యాపార గర్జన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. విజయసాయి రెడ్డి ఇతర వైసీపీ నేతలపై వస్తున్న భూదందా ఆరోపణలను పరిగణననలోకి తీసుకుంటే, వికేంద్రీకరణ మంత్రం అసలు రహస్యం ఏమిటో అందరికీ అర్థమవుతుంది. అందుకే మంత్రులు విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని గర్జిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్నారు. మరో వైపు మూడు రాజధానులు వద్దు, అమరావతినే ఏకైక రాజధానిగా కొనాసాగించాలి కోరుతూ రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు వ్యతిరేకంగానే వైసీపీ మహా గర్జన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని మంత్రులు శపథం చేశారు. అంటే వికేంద్రీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల స్టాండ్ ఏమిటి, ప్రజల అభిమతం ఏమిటి అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు అమరావతి ఏకైక రాజధానికే ఓటేశారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అంటున్నారు. చివరకు రాష్ట్రంలో సున్నాఅయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా అమరావతికే ఓటేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని అంటోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గోడ మీది పిల్లి వాటంగా ఎటూ తేల్చకుండా అసలు కేంద్రానికి సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అధికార వైసేపీ వికేంద్రీకరణ పేరిట సాగిస్తున్నఅరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాఖలు కనిపించడం లేదని బీజేపీ, వైసీపీ యేతర రాజకీయ పార్టీలు అక్షేపిస్తున్నాయి. ఇదలా ఉంటే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని అన్నారు. అంతే కాదు అమరావతే రాజధాని అని ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారంటూ చెప్పుకొచ్చారు. అందుకే అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఆవు కథను మళ్ళీ వినిపించారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏది చేసినా రాజధాని మార్చే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ఇంత ఘంటాపథంగా చెపుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, మరో మంత్రి, బీజేపీ నాయకులు కానీ మూడు రాజధానుల పేరిట అరాచకానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం పై ఎందుకు చర్యలు తీసుకోదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆ చెప్పేదేదో కిషన్ రెడ్డి ఒక్కరికే చెవిలో కాకుండా నేరుగా ప్రజలకే చెపితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంతి జగన్ రెడ్డి మళ్ళీ ‘మూడు’ మాట ఎత్తరుకదా? అని అడుగుతున్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నట్లు చూస్తున్నది కాబట్టే వైసేపీ గర్జన పేరిట విశాఖలో అరాచకానికి పాల్పడిందని అంటున్నారు. రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు వైసేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. నిజానికి రాజధాని సమస్యను పరిష్కరించవలసిన చట్టబద్ధ బాధ్యతతో పాటుగా నైతిక బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత నుంచి తప్పించుకున్నా నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వహస్తాలతో శంఖుస్థాపన చేశారు. దివ్యమైన, భవ్యమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చింది. అంతే కాదు, 2017 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజధాని రైతులకు ఆదాయ పన్ను మినహాయింపును ఇచ్చారు. అంటే, ఏ కోణం నుంచి చూసినా, రాజదాని అంశం కేంద్రం పరిధిలో లేని అంశం కాదు. కేంద్ర పరిధిలోనే ఉంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యతా కేంద్రానికి వుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మాటలతో సరి పెట్టడం కాకుండా చేతలలో చిత్తశుద్ధి చూపాలని ఏపీ ప్రజలు అంటున్నారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ ...గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్న గురజాడ మాటలు గుర్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/miniserji-show-action-not-mere-words-25-145656.html