పోలీసులపై మజ్లిస్ కార్పొరేటర్ రుబాబు.. కేటీఆర్ ట్వీట్‌తో అరెస్ట్
Publish Date:Apr 6, 2022
Advertisement
అతను ఎంఐఎం కార్పొరేటర్. పోలీసులపై బాగా రుబాబు చేశాడు. అర్థరాత్రి భోలక్‌పూర్‌లో హల్‌చల్ చేశాడు. ఆ వీడియో నేరుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌కు చేరింది. ఆయన సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించ వద్దని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోమంటూ.. డీజీపీకి సూచించారు. కట్‌చేస్తే.. మజ్లిస్‌కు చెందిన భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కార్పొరేటర్ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో.. పోలీసులు భోలక్‌పూర్ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లారు. అప్పటికీ కొన్ని షాపులు తెరిచే ఉండటంతో వాటిని మూసేయాలని దుకాణదారులకు సూచించారు. రంజాన్ సందర్భంగా షాపులు తెరుచుకుంటున్నామంటూ కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలిసి స్థానిక కార్పొరేటర్ గౌసుద్దీన్ అక్కడకు వచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రంజాన్ మాసంలో తెల్లవార్లు హోటళ్లు తెరచి ఉంటాయని, నిర్వాహకులను ఇబ్బంది పెట్టవద్దని గట్టిగా హెచ్చరించేలా మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారంటూ.. మీ డ్యూటీ మీరు చేసుకొని వెళ్లిపోవాలంటూ.. బిగ్ వాయిస్‌తో పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగానే గౌసుద్దీన్‌కి మరింత మండుకొచ్చింది. నువ్ ఆఫ్ట్రాల్ 100 వ్యక్తివి.. నువ్వు నాకు సమాధానం చెబుతావా? అంటూ హేళనగా మాట్లాడారు. మీ ఎస్సైని రమ్మను.. కార్పొరేటర్ వచ్చాడని చెప్పు.. అంటూ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులతో కార్పొరేటర్ రుబాబుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్విటర్‌లో ఓ నెటిజన్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై స్పందించిన మంత్రి.. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
http://www.teluguone.com/news/content/mim-corporator-gousuddin-arrest-39-134008.html





