కేసు పరిష్కరించాలంటే మద్యం బాటిళ్లు కావాలి...ఎస్సై డిమాండ్
Publish Date:Apr 13, 2026
Advertisement
సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పితే ఇక బాధితులు ఎక్కడికి వెళ్లాలి? తన భూమి కబ్జాకు గురైందని, న్యాయం చేయాలని వేడుకున్న ఒక బాధితుడికి మీర్‌పేట ఎస్సై నుంచి విస్తుపోయే సమాధానం ఎదురైంది. సమస్య పరిష్కరించాల్సింది పోయి, తనకు అర్జెంటుగా మద్యం బాటిళ్లు పంపాలని సదరు అధికారి డిమాండ్ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పరిధిలోని లెనిన్‌నగర్‌లో తిరుపతయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య లత పేరిట 2010లో గిఫ్ట్ డీడ్ ద్వారా సుమారు 11 గజాల స్థలం సంక్రమించింది. అందులో ఒక షెట్టర్ నిర్మించుకుని వారు సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతంలో ఆ స్థలాన్ని విక్రయించిన వెంకటేష్ అనే వ్యక్తి, ఈ నెల 4న ఆక్రమణకు పాల్పడి అక్రమంగా నిర్మాణం చేపట్టాడు. తన స్థలం ఆక్రమణకు గురైందని తిరుపతయ్య మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మీర్‌పేట ఎస్సై నాగభూషణం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి, పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అవతలి వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించడంతో, బాధితుడు మళ్లీ మళ్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎస్సై నాగభూషణం బాధితుడికి ఫోన్ చేసి అసలు రంగు బయటపెట్టారు. కేసు విషయంలో సహాయం కావాలంటే తనకు వెంటనే రెండు మద్యం బాటిళ్లు పంపాలని కోరారు. తాను ఊర్లో లేనని తిరుపతయ్య చెప్పినప్పటికీ, వినకుండా "పిల్లలెవరితోనైనా సరే పంపించు" అంటూ ఒత్తిడి చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆదివారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. పోలీసుల అవినీతి తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమస్యలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన అధికారులే ఇలా బాటిళ్ల కోసం బేరసారాలు ఆడటం ఖాకీల ప్రతిష్టను మంటగలుపుతోందని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరిస్తూ ఎస్సై నాగభూషణంపై వేటు వేశారు. ఆయనను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుడికి ఆ 11 గజాల స్థలం విషయంలో ఇప్పటికైనా పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
http://www.teluguone.com/news/content/meerpet-si-audio-viral-36-217261.html





