ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం.. 18 మంది కార్మికులు గల్లంతు
Publish Date:Jun 22, 2026
Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన కేంద్రం అయిన ఖతార్ లోని గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ’లో ఆదివారం రాత్రి (జూన్ 21) చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆపరేషన్లను, అంతర్జాతీయ ఎగుమతులను తిరిగి ప్రారంభించడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. గతంలో ప్రాంతీయంగా నెలకొన్న తీవ్ర రాజకీయ, సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల వల్ల ఈ ప్లాంట్ చాలా తీవ్రంగా దెబ్బతింది. ఆ దాడుల కారణంగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి, వారాల తరబడి ఈ ప్లాంట్ మూతపడింది. ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని, ఇంధన ఉత్పత్తిని మళ్లీ గరిష్ఠ స్థాయికి చేర్చాలని ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి, ప్లాంట్‌ను పునఃప్రారంభించేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ గల్లంతైన ఆ 18 మంది కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాంట్ శిథిలాల మధ్య అత్యంత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. గ్లోబల్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులకు కేంద్ర బిందువైన రాస్ లఫాన్ హబ్‌లో ఈ ప్రమాదం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
http://www.teluguone.com/news/content/massive-explosion-at-qatar-gas-plant-36-223717.html





