నిజాం ఆభరణాల డీల్ లో 50 కోట్లు భారీ మోసం!
Publish Date:Apr 15, 2026
Advertisement
హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి ఆభరణాల పేరుతో 50 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజాం కాలం నాటి ఐదు ఆభరణాల పెట్టెలు ప్రభుత్వ కస్టడీలో చిక్కుకుపోయాయనీ, చట్టపరమైన ఖర్చులు భరించి వాటిని విడుదల చేయిస్తామని నిందితులు హామీ ఇచ్చినట్లు అగర్వాల్ చెబుతున్నారు. దీంతో 2016 జూన్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య తాను రూ.50.8 కోట్లు వివిధ కంపెనీల ద్వారా బదిలీ చేశానని ఆయన పేర్కొన్నారు. కానీ ఆభరణాలు విడుదలకు దగ్గరపడిన సమయంలోనే అసలు కథ బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆభరణాల విడుదలకు ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించ డంతో పాటు, ఆభరణాలను స్వతంత్రంగా తమ పేర్లతో స్వాధీనం చేసుకుని విక్రయించే ప్రయత్నం చేశారని అగర్వాల్ ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఈ ఆభరణాలకు దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 1958లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాం ఆభరణాలను వారసుల నుంచి రిజిస్టర్డ్ అసైన్‌మెంట్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆభరణాలు ప్రభుత్వ కస్టడీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఆ ఐదు పెట్టెల్లో అసలు ఏముంది? వాటి విలువ ఎంత? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్‌కు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 406, కామన్ ఇంటెన్షన్ సెక్షన్ 34 కింద ఉస్మాన్ మరియు గుప్తలపై కేసు నమోదు చేశారు. నిందితుల వాంగ్మూలాలను సేకరించి ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నిజాం ఆభరణాల పేరుతో ప్రారంభమైన ఈ భారీ డీల్… ఇప్పుడు భారీ మోసం కేసుగా మారి నగర వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నగరానికి చెందిన మరో వ్యాపారవేత్త ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్ సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా గుప్తా ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.
http://www.teluguone.com/news/content/massive-50-crore-fraud-in-nizam-jewels-deal-36-217391.html





