కుంభమేళా.. దక్షిణాదిన జెండా..అదే బీజేపీ ఎజెండా!
Publish Date:Mar 3, 2025
Advertisement
మహా కుంభమేళా ముగిసింది. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ రాజ్ లోని త్రివేణి సంగమం కేంద్రంగా 45 రోజుల పాటు సాగిన ‘మహా కుంభ మేళా’ మహాశివరాత్రి మహా పర్వదినాన మహా హారతితో ముగిసింది. ఈ 45 రోజుల్లో దేశ జనాభాలో సగం మందికి పైగా, అంటే 66 కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. బహుశా ప్రపంచ చరిత్రలో, ఈ స్థాయిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం మరొకటి ఉండదేమో. మన దేశం నుంచి మాత్రమే కాదు, 70కి పైగా ప్రపంచ దేశాల నుంచి ఆద్యాత్మిక, సామాజిక, రాజకీయ ప్రముఖులు మహా కుంభ మేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు చేశారు. అంతే కాదు, కుంభ మేళాలో ఇంకా అనేక వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. వేపపుల్లల చిరు వ్యాపారి నుంచి విమాన సర్వీస్’ వరకు రకరకాల వ్యాపారాలు మూడు మునకలు ఆరు కాసులు, అన్నట్లు ‘పుణ్యాన్ని’మూట కట్టుకున్నాయి. అలాగే ప్రకృతి అందాలను మూట కట్టుకున్న ‘పూసల మొనాలిసా’ కూడా కుంభమేళా పుణ్య ఫలమే. అయితే, మహా కుంభమేళా ఒక ముగిసిన అధ్యాయం. మళ్ళీ ఎప్పుడో 144 సంవత్సరాల తర్వాత వచ్చే వేడుక. అయితే ఆద్యాత్మిక కుంభమేళా ముగిసిన అధాయమే అయినా.. కుంభమేళాతో ముడుపడిన రాజకీయ మేళా మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదని, అసలు ముగింపే ఉండక పోవచ్చని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ స్ట్రాటజీని సమర్ధవంతంగా ఎదుర్కునే కౌంటర్ స్ట్రాజీలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడులో అధికార డిఎంకే, తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన హిందీ వ్యతిరేక ఆందోళన ను తెరపైకి తెచ్చింది. అలాగే,పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో తమిళనాడుతో పాటుగా కేరళ, తెలంగాణ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గొంతు కలిపాయి.అలాగే కేంద్ర నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుతాన్ని నిలదీస్తునారు.అలాగే ప్రతిపక్షాల అంబుల పొదిలో కుల గణన అస్త్రం ఎలానూ ఉండనే వుంది.ఇలా ముగిసిన కుంభమేళాతో మొదలైన కొత్త రాజకీయం, దేశంలో, ముఖ్యంగా దక్షణాది రాష్టాలలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పడు ఓ పెద్ద ప్రశ్నగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు.. ముఖ్యంగా ఉత్తరాది పార్టీలు కుంభమేళా రగిల్చిన హిందుత్వ సెంటిమెంట్ ను క్యాచ్ చేయడంలో విఫలమయ్యాయనీ.. అందుకే అనవసర విమర్శలు చేసి తప్పులో కాలేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే,దేశంలో 80శాతం వరకు ఉన్న హిందువుల మనోభావాలను విస్మరించి, భారత రాజకీయాల్లో నెగ్గాలనుకోవడం, నెగ్గగలం అనుకోవడం జస్ట్ నాటే సింపుల్ మిస్టేక్, బట్ ఎ పొలిటికల్ బ్లండర్’ అంటున్నారు. నిజానికి విపక్ష ఇండియా కూటమి, తమ పొలిటికల్ ఎజెండాను పునః సమీక్షించుకోవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి కుంభమేళా మొదలైన నాటి నుంచి, ఇంకా మాట్లాడితే అంతకంటే ముందు నుంచే దేశ పొలిటికల్ నెరేషన్ లో మార్పు చోటు చేసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేక భంగ పడిన బీజేపీకి తత్వం బోధపడింది. దిద్దుబాటు చర్యలకు సిద్దమైంది.పార్టీకి ప్రాణవాయువుతో సమానమైన హిందుత్వ నాదం జోష్ పెంచింది. ఫలితంగా, హర్యాణ, మహారాష్ట్ర, తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేసింది. ఈ నేపధ్యంలో వచ్చిన మహా కుంభమేళాను బీజేపీ, సంఘ్ పరివార్ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’ ‘కొత్త’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భారతీయుల ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని 'ఎక్స్' వేదికగా స్పందించారు. అలాగే, కేంద్ర హోం మంత్రి ఎప్పటి నుంచో కమల దళం పట్టుకోసం ప్రయత్నిస్తున్న తమిళనాడు పర్యటనలో, కుంభమేళలో వ్యక్తమైన హిందూ సెంటిమెంట్ అస్త్రంగా రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నాలను శ్రీకారం చుట్టారు. తమిళనాడు నుంచి రెండున్నర కోట్లమంది హిందువులు కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించారు. ఇది కమల దళంలో కొత్త అసలు చిగురింప చేసిందని అంటున్నారు. నిజానికి ఒక్క తమిళనాడు అనే కాదు, మొత్తంగా దక్షణాది రాష్ట్రాలలో పట్టుపెంచుకునేందుకు కుంభమేళా నుసెంటిమెంట్ అస్త్రంగా మలచుకునే వ్యూహంతో ముందుకు సాగుతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mahakumbha-mela-bjp-political-milage-39-193786.html





