ఇక కపటనల్లో నటించకండి...
Publish Date:Jun 2, 2015
Advertisement
ఇప్పుడు అనేక ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ వస్తున్న ప్రకటనల్ని ‘ప్రకటనలు’ అనడం కంటే, లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పే కపటత్వం కలిగి వుంటున్నాయి కాబట్టి వాటిని ‘కపటనలు’ అనడం కరెక్టేమో. ఇలాంటి ప్రకటనల్లో నటించడానికి సినిమా నటీనటులు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. కారణం.. బోలెడంత డబ్బు వస్తుంది.. తాము జనం కళ్ళముందు కదులుతూ వుండొచ్చు... ఇలా అనేక లాభాపేక్షలు సినిమా తారలను ప్రకటనల్లో నటించడానికి ఉత్సాహాన్ని ఇస్తూ వుంటాయి. పలానా ఉత్పత్తిని వాడండని చెప్పే తారలు వ్యక్తిగతంగా ఆ ఉత్పత్తులను ఉపయోగిస్తారా అంటే... పొరపాటున కూడా ఉపయోగించరు. చెప్పడానికే తప్ప ఆచరణ ఎంతమాత్రం వుండదు. తాము ఉపయోగించడానికే ఇష్టపడని ఉత్పత్తులను జనం చేత కొనిపించడానికి తారలు ప్రేరేపిస్తూ వుంటారు. ఇప్పుడు అదే వారి పీకకు చుట్టుకుంటోంది.
ఒక బహుళజాతి సంస్థ తయారు చేసే నూడిల్స్‌ని మీరు తినండి, మీ పిల్లల చేత తినిపించండి.. రెండు నిమిషాల్లో తయారైపోయే ఈ నూడిల్స్ మాంఛి టేస్టుగా వుండటంతోపాటు మీకు సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పే ప్రకటనల్లో నటించిన పాపానికి, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన పాపానికి బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా ఇప్పుడు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. విషతుల్యమైన పదార్ధాలు మోతాదు మించి వున్న సదరు నూడిల్స్‌లో ఉన్నప్పటికీ తినండంటూ జనాన్ని ప్రేరేపించిన పాపం ఇప్పుడు వారిని వేధిస్తోంది. వీరిని చట్టం ఎలా శిక్షించబోతోందో, లేక ప్రస్తుతానికి క్షమించి వదిలేస్తుందోగానీ, భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తుల ప్రకటనల్లో నటించే తారలకు భారీ శిక్షలు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష విధించే విధంగా చట్టం తెచ్చే ఆలోచనలో వున్నామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెబుతున్నారు. ఈ చట్టమే అమల్లోకి వస్తే దిక్కుమాలిన ఉత్పత్తులకు ప్రచారం చేసే తారలు ఇక జైల్లో కాలక్షేపం చేయాల్సి రావచ్చు. అంచేత తారలూ... అలాంటి ఉత్పత్తుల కపట ప్రకటనల్లో నటించడం మానుకోండి.
http://www.teluguone.com/news/content/maggi-45-46977.html





