30 ఏళ్ల పార్టీ.. మూడు నిమిషాల్లో మటాష్..!!
Publish Date:Oct 30, 2017
Advertisement
తెలుగుదేశం పార్టీ.. దశాబ్ధాల పాటు ఏకఛత్రాధిపత్యం కింద ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కోటలను బీటలను వార్చిన పార్టీ. తెలుగోడి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ వంటి శిఖరాన్ని ఢీకొట్టడమంటే అది మామూలు విషయం కాదు.. అందుకు కారణం టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు పిలుపునందుకొని పార్టీకి మద్ధతునిచ్చి.. నేటికీ పార్టీ జెండా మోస్తున్న కోట్లాది మంది కార్యకర్తలు. టీడీపీ ఇంతకాలం రాజకీయాల్లో మనగలిగిందంటే అందుకు కారణం బలమైన క్యాడరే. అటువంటి పార్టీలో ఒక కుదుపు తీసుకువచ్చింది రాష్ట్ర విభజన. ఏపీలో అధికారాన్ని అందుకున్న తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో కూర్చొవలసి వచ్చింది. చివరిసారిగా 2004లో ఉమ్మడి ఏపీలో పవర్‌ను చేజార్చుకున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ముచ్చటగా మూడో పర్యాయం కూడా ప్రతిపక్షమే దిక్కైంది. సమీప కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చే సూచన కనిపించకపోవడంతో.. ఎంతోమంది నేతలు అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇదే క్రమంలో 2014లో 15 మంది శాసనసభ్యులతో బలంగా కనిపించిన టీడీపీ.. మూడున్నరేళ్లు గడిచేసరికి ముచ్చటగా ముగ్గురితో సరిపెట్టుకుంది. కానీ కిందా మీద పడి.. కార్యకర్తలతో మద్ధతుతో బండి లాక్కొస్తున్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఊహించని షాక్‌నిచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆయన ఎంతమంది నాయకులు బయటికి వెళ్లినా.. ఏన్ని రకాల రాజకీయాలు జరిగినా చెక్కుచెదరకుండా ఉన్న పార్టీ క్యాడర్‌ను బీటలు వార్చారు. ఎన్టీఆర్ టీడీపీకి అంకురార్పణ చేస్తూనే బీసీలను బలంగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా బలమైన రెడ్డి సామాజిక వర్గం కూడా టీడీపీ జెండా మోసింది. ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి వంటి వారితో మొదలుకుని ఎంతో మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అంతకు మించిన నేతలుగా పార్టీకి సేవ చేశారు. ఇలా కులాలకు అతీతంగా టీడీపీకి అండగా నిలబడిన వారంతా ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నారు. అందుకు కారణం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురునిలవగల మోనగాడికి ఆయనను చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు..అందువల్ల ఆయనకే తమ మద్ధతు ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. స్వయంకృతమో.. మరేదైనా కారణమో కానీ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం పార్టీని జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేసింది. అప్పటి నుంచే టీడీపీకీ తెలంగాణలో పతనం స్టార్ట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. తొలి నుంచి రేవంత్ వ్యవహారశైలి నచ్చని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాశనం కావడానికి ఆయనే కారణమన్నారు.. పార్టీలోకి వచ్చిన ఆరేళ్లలోనే టీడీపీని భ్రష్టు పట్టించిన ఘనత రేవంత్‌రెడ్డిదే అన్నారు. తనతో పాటు ఎంతోమంది నేతలు 30 ఏళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి బలోపేతం చేసిన పార్టీని రేవంత్ నిమిషాల్లో నాశనం చేశారని వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/madhavaram-krishna-rao-45-78550.html





