సెంటిమెంటల్ టచ్ సూపరెహె
Publish Date:Jun 1, 2015
Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని వైసీపీ నేత రొటీన్‌గా చేసే ప్రయత్నాలు తప్ప అక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన రాజకీయ పరిణామాలేవీ కనిపించడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం రాజకీయం మహా రంజుగా సాగుతోంది. తెలంగాణ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్‌లోకి వలస వెళ్ళడం దగ్గర్నుంచి, నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కావడం వంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద అందరికీ ఇంట్రస్టు పెరగడానికి కారణం అయ్యాయి. రేవంత్ రెడ్డి విషయం అలా వుంచితే, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లోకి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ కొన్ని రికార్డు చేసిన మాటలు చెబుతూ వుంటారు. టీఆర్ఎస్ అద్భుత పాలన చూసి ఆకర్షితుడిని అయ్యానని, అలాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెబుతారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ మీద కొన్ని విమర్శలు కూడా చేస్తారు.
అయితే లేటెస్ట్‌గా పార్టీ మారిన కూకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు మాత్రం పార్టీ మారినప్పుడు వాడే పడికట్టు పదాలను ఉపయోగించడంతోపాటు కొంత సెంటిమెంటల్ టచ్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో తెలుగుదేశం పార్టీకి జలక్ ఇచ్చిన ఆయన కళ్ళలో నీటి పొరలు కదులుతూ వుండగా తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే, తన నియోజకవర్గంలో వున్న పేదల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనను పార్టీ మారకుండా చేయాలని పార్టీ నాయకత్వం ఎంత ప్రయత్నించినా మారకుండా వుండలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఇలా అన్యాయం చేసినందుకు తనను చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమించాలని తెగ ఫీలైపోతూ చెప్పారు. మాధవరం కృష్ణారావు చివర్లో ఇచ్చిన ఈ సెంటిమెంటల్ టచ్ మనసులను హత్తుకునేలా వుంది. టీఆర్ఎస్‌లో టైం బాగాలేకపోతే మళ్ళీ టీడీపీలోకి రావడానికి ముందుగానే కర్చీఫ్ వేసినట్టుగా వుంది.
http://www.teluguone.com/news/content/madhavaram-krishna-rao-45-46905.html





