మోహినిగా మారిన అలేఖ్య
Publish Date:Jan 29, 2021
Advertisement
మదనపల్లి హత్యాకాండ వ్యవహారంలో పెద్దకూతురు అలేఖ్య పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్న పెద్ద కూతురు అలేఖ్య గురించి దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ దారుణాల్లో 27ఏళ్ల అలేఖ్య ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ హత్యల తరువాత తల్లిదండ్రులు, పద్మజ, పురుషోత్తంలను పోలీసులు అరెస్ట్ చేయగా షాకింగ్ విషయాలు బైటపడుతున్నాయి. చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన అలేఖ్య.. చిన్నచిన్న మ్యాజిక్‌లు చేసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేది. కూతురు ప్రతిభకు తల్లిదండ్రులు మురిసిపోయేవారు. తమ కూతురికి నిజంగానే అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు. అలా కొన్ని కొన్ని చేష్టలతో అలేఖ్యను తల్లిదండ్రులు పూర్తిగా నమ్మారు. తమ ఇద్దరు కూతుళ్లు సాక్షాత్తు శివుడు, పార్వతులని పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు మురిసిపోయేవారట. అదే విషయాన్ని వారు పోలీసులకు చెప్పారట. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అలేఖ్య, తన చెల్లెలు సాయి దివ్య కలిసి తమ పెంపుడు కుక్కతో బయటకు షికారుకు వెళ్లారు. అప్పుడు చిన్నకూతురు సాయి దివ్య..బయట ముగ్గు మధ్యలో ఉన్న నిమ్మకాయ తొక్కినట్లు అనుమానపడింది. అదే విషయాన్ని అక్కకు, తల్లిదండ్రులకు చెప్పింది. ‘నేను చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది..అని తరచూ ఏడుస్తూ చెప్పేది. తరచూ భయపడిపోయేది. దానికి అలేఖ్య ‘‘చెల్లీ నువ్వు చచ్చిపోతే నేను నిన్ను బతికిస్తానుగా’’ అంటూ అనుమానాలకు..భయాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో దివ్యకు మరింతగా తాను నిజంగానే చచ్చిపోతాననే భయం పెరిగిపోయింది. ఈ క్రమంలో గత శనివారం ఓ భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు. అయినా దివ్యకు తాను చచ్చిపోతాననే భయం తగ్గలేదు. అలా 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు, అలేఖ్య కలిసి ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. ఏవేవో మంత్రాలు జపించారు. అయినా దివ్యకు భయం తగ్గలేదు. గట్టి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అలేఖ్య చెల్లెలు దివ్యను చంపేయాలని..తరువాత తాను బతికిస్తానని అలేఖ్య తల్లిదండ్రుల్ని బాగా నమ్మించింది. అలా సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను డంబెల్‌తో తలపై బలంగా కొట్టి చంపేశారు.తర్వాత పదునైనా శూలంతో పొడిచి.. ముఖాన్ని కూడా చెక్కేశారు. తరువాత అలేఖ్య చెల్లెలి ఆత్మను బంధించాను..ఇప్పుడు నన్ను కూడా మీరు చంపేయండి..చెల్లెలి ఆత్మను తీసుకొస్తాను..తరువాత ఇద్దరం కలిసి బతికి వస్తామని నమ్మించింది. తనను ఎలా చంపాలో కూడా చెప్పింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. గతంలో తాను కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య చెప్పింది. కూతురు మాటల్ని వాళ్లు బాగా నమ్మారు. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక పల్చటి చీర ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య చంపినట్లుగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు అలేఖ్యను చంపారు. అలా అలేఖ్య మాటలకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య.. చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో దారుణంగా హతమైంది. పునర్జన్మలపై ఉన్న మూఢ నమ్మకమే ఈ హత్యలకు కారణమని నిందితులు చెప్పిన మాటల్ని బట్టి పోలీసులు భావిస్తున్నారు. అలేఖ్యకు విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఆమె సోషల్ మీడియా పోస్టులను బట్టి తెలుస్తోంది. గత వారం రోజులుగా అలేఖ్య పెట్టిన పోస్టులు చూస్తే..పక్కా ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేసినట్లుగా అనుమానాలొస్తున్నాయి. జనవరి 22న అలేఖ్య తన పేరును ‘మోహిని’గా మార్చుకుంటూ పోస్టు చేసింది. తాను ప్రపంచ సన్యాసిని అంటూ చెప్పొకొచ్చింది. వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ‘ఓషో’ తన ప్రేమికుడని అలేఖ్య ప్రకటించుకుంది. అలాగే తన స్టడీ రూంలో కూడా ఓషో ఫొటోను పెట్టుకుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కూడా అలేఖ్య ఫాలో అయ్యేది. చావు, పుట్టుకలకు సంబంధించి సద్గురు ప్రవచించిన కొటేషన్‌ను అలేఖ్య పోస్టు చేస్తుండేది. పునర్జన్మల పిచ్చిలో అలేఖ్య ఈ అఘాయిత్యానికి పాల్పడిన తరుణంలో ఆ పోస్టు ఈ హత్యల అనంతరం వైరల్ గా మారింది.
http://www.teluguone.com/news/content/madanapalle-latest-updates-39-109371.html





