ప్రేమ పేరుతో మోసం.. పోలీసు అధికారిపై కేసు.!
Publish Date:Oct 11, 2026
Advertisement
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు..! అలాంటి సమయంలో పరిచయమైన ఓ వ్యక్తి తనకు అండగా నిలుస్తాడని ఆమె భావించింది. తన జీవితంలో మళ్లీ సంతోషం వస్తుందని ఆశపడింది. కానీ, ఆ పరిచయం చివరకు తనను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆమెను మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఓ పోలీసు అధికారి! భర్త అనారోగ్యం.. జీవితంలో ఊహించని కష్టం.! నల్గొండలోని సాయినగర్‌కు చెందిన మహిళకు 2008లో సాయి కుమార్‌తో వివాహమైంది. 2014లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో 2015లో ఆమె జీవితాన్ని విషాదం కమ్ముకుంది. మెట్లపై నుంచి జారిపడిన భర్తకు వెన్నెముక విరగడంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమెపై పడ్డాయి. ఈ క్రమంలో 2016 డిసెంబర్లో చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం. బాలస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఫోన్ సంభాషణల వరకు వెళ్లింది. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు. పెళ్లి హామీతో మొదలైన బంధం..! 2017 జనవరిలో బాలస్వామి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సమస్యలు పరిష్కారమైన తర్వాత వివాహం చేసుకుందామని ఇద్దరూ అంగీకరించినట్లు తెలిపింది. అదే ఏడాది మార్చిలో తన భర్త ఇంట్లో లేని సమయంలో బాలస్వామి ఇంటికి వచ్చి, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.అయితే, కొంతకాలానికి బాలస్వామికి అప్పటికే వివాహమైందని ఆమెకు తెలిసింది. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నానని, విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని అతను చెప్పినట్లు బాధితురాలు వెల్లడించింది. అతను వివాహితుడని తెలిసిన తర్వాత దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వీడియో కాల్స్ చేయడంతో భయపడి మళ్లీ మాట్లాడాల్సి వచ్చిందని ఆరోపించింది. భర్త మరణించినా.. తీరని ఎదురుచూపులు.! 2021 మే 8న ఆమె భర్త మరణించారు. ఆ తర్వాత కూడా బాలస్వామి తనతో సంబంధాన్ని కొనసాగించాడని బాధితురాలు ఆరోపించింది. విడాకులు తీసుకున్నానని చెబుతూ, పెళ్లి చేసుకుంటానని పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ.. వివాహం గురించి ప్రస్తావించిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో తప్పించుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది. 2024లో బాలస్వామి కర్మన్‌ఘాట్‌లో కొత్త ఇల్లు నిర్మించి, తన భార్యాపిల్లలను తిరిగి తనతో పాటు ఉంచుకున్న విషయం బంధువుల ద్వారా తెలిసిందని ఆమె తెలిపింది. దీనిపై నిలదీయగా అసభ్య పదజాలంతో దూషించి, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసినట్లు ఆరోపించింది. కొంతకాలానికి మళ్లీ తనను సంప్రదించి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించాడని ఫిర్యాదులో పేర్కొంది. మానసిక వేదన.. చివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.! 2025 జనవరి నుంచి బాలస్వామి తనకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా పెళ్లి హామీని నమ్మి ఎదురుచూసిన తనను చివరకు మోసం చేశాడని ఆరోపిస్తూ.. 2026 అక్టోబర్ 9న సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎం. బాలస్వామిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 69, 81, 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకవైపు జీవితంలో ఎదురైన కష్టాలు.. మరోవైపు పెళ్లి హామీతో మోసం చేశారన్న ఆరోపణలు.. చివరకు ఆసుపత్రి చికిత్స, పోలీసుల వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. [ M Balaswamy, Hyderabad Police Officer Arrest, Marriage Fraud Case, Saifabad Police, Khairatabad Detective Inspector, Woman Cheating Case, False Marriage Promise, Sexual Relationship Allegations, BNS Section 69, BNS Section 81, Hyderabad Crime News, Karmanghat Case ]
http://www.teluguone.com/news/content/m-balaswamy-25-234035.html





