మురళీధరుడిగా శ్రీరాముడు.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనం
Publish Date:Mar 28, 2026
Advertisement
త్రేతాయుగపు రాముడు, ద్వాపరయుగపు కృష్ణుడై వేణువును చేబూనితే.. ఆ దృశ్యం భక్తజనావళికి కన్నుల విందే.. సాక్షాత్తు వైకుంఠ దర్శనమే. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం (మార్చి 28) భక్తకోటికి ఆ దృశ్యమే సాక్షాత్కారమైంది. రామయ్య తండ్రి వేణుగాన అలంకారంలో కొలువుదీరి భక్తులను తరింపచేశారు. పిల్లనగ్రోవి ధరించి, చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. మంగళవాయిద్యాల సమ్మేళనం, వేదపండితుల మంత్రఘోషల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. సన్నాయి నాదాలు ఆకాశాన్ని తాకుతుంటే, భక్తుల 'గోవింద' నామస్మరణలతో ఏకశిలా నగరం ప్రతిధ్వనించింది. పురవీధుల గుండా స్వామివారు కదులుతుంటే, భక్తులు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి, అగరుధూపాలతో నీరాజనాలు సమర్పించారు. ఈ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆధ్యాత్మికతను శిఖరాగ్రానికి చేర్చాయి. కేరళ నుండి వచ్చిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో చేసిన వాయిద్య ప్రదర్శనలు, లయబద్ధమైన నృత్యాలు భక్తులలో ఉత్తేజాన్ని నింపాయి. గజ్జెల సవ్వడులతో, తాళాల హోరుతో భజన బృందాలు చేసిన సంకీర్తనలు పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికతతో నింపివేశాయి.వేణుగాన అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు హరించి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. స్వామివారి ఊరేగింపునకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కర్పూర హారతులు ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/lord-rama-as-muralidhara-36-216320.html





