గణపతినీ వదిలిపెట్టమంటోన్న... సినిమా పిచ్చోళ్లు!
Publish Date:Sep 6, 2016
Advertisement
వినాయక చవితి వచ్చేసింది. వినాయక నవరాత్రులు ఘనంగా మొదలయ్యాయి. అయితే, మిగతా పండగలకి గణేశ ఉత్సవాలకి ఓ తేడా వుంది! అదేంటంటే, గణనాథుని పూజలు ఎవరింట్లో వాళ్లు చక్కగా చేసుకుంటారు. అదే సమయంలో వీదుల్లో కూడా వేలాది పందిళ్లు వెలుస్తాయి. అన్ని కులాల వారు కలిసికట్టుగా కుడుములు పెట్టి బొజ్జ గణపయ్యను పూజించుకుంటారు. నిజానికి ఇలాంటి ఉత్సవం మన దేశంలో ఎంత అవసరం కూడా! మతాలు, కులాలు వారిగా మనం విడిపోయి వుంటాం కాబట్టి ఐకమత్యం తెచ్చే వినాయక ఉత్సవాల్లాంటివి వుంటే చాలా మంచిది! వినాయకుడు ఇంట్లో పూజించుకున్నప్పుడు క్లాస్ దేవుడే! కాని, వీధిలోకి వచ్చాక మాస్ దేవుడైపోతాడు. ఓన్లీ వేద మంత్రాలు మాత్రమే వుండవు. డప్పులు, డ్యాన్సులతో కోలాహలం రేగుతుంది. ఇది ఒక విధంగా ఛాందస వాదులకి నచ్చదు. దేవుడి ముందు పిచ్చి గంతులు ఏంటని వాళ్లంటారు! అయినా సరే, హైద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో తీన్మార్ డ్యాన్సులు గణపతి నిమజ్జనంలో భాగం అయిపోయాయి. ఇప్పుడు ఆ డ్యాన్సులు పోయేవి కావు. కాబట్టి వాట్ని ఎలాగో ఒప్పుకోవచ్చు. కాని, వినాయక ఉత్సవాల్లో పొడసూపుతున్న మరో లేటెస్ట్ ట్రెండ్ కొంత ఆందోళనకరంగా, చికాకుగా వుంటోంది! దీనిపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది... తెలుగు వారికి సినిమా పిచ్చి కాస్త ఎక్కువే! తమిళ జనమంత క్రేజ్ వుందో లేదో తెలియదుగాని మనకు మాత్రం సినిమా అభిమానం ఓ రేంజ్లో వుంటుంది. అందుకే, మన స్టార్ హీరోలకు ఎక్కడలేని ఫాలోయింగ్! అయితే, ఈ సినిమా వ్యామోహం మెల్లగా గణేశ ఉత్సవాలకు సోకడమే ఇబ్బందిగా మారుతోంది. ఈ సారి ఆంద్రప్రదేశ్ లో ఓ చోట వినాయక గ్యారేజ్ ఏర్పాటు చేశారట! ఇక్కడ అన్ని కొర్కెలు తీర్చబడును అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారట! అంతే కాదు, లోపల వినాయకుడి విగ్రహం జనతా గ్యారేజ్ పోస్టర్ పై ఎన్టీఆర్ ఎలాంటి స్టిల్ లో వున్నాడో... అచ్చం అలాగే పెట్టారట! ఎన్టీఆర్ తొడుక్కున గళ్ల చొక్కా కూడా వినాయకుడికి వేశారట! ఇదేం విడ్డూరం? ఈ సారి జనతా గ్యారేజ్ ఇన్ స్పిరేషన్ తో వినాయకుడ్ని స్థాపించడమే కాదు... ప్రతీ యేడూ ఈ మధ్య ఇలాగే జరుగుతోంది. ఓ సారి గబ్బర్ సింగ్ గణపతి దర్శనమిస్తే , మరో సారి బాహుబలి బొజ్జగణపయ్య కనిపిస్తాడు! ఇదంతా పైకి వినోదంగా కనిపించినా దీర్ఘకాలంలో చాలా దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం వుంది. సినిమాలు, సినిమా హీరోల పై అభిమానం వుండటం తప్పు కాదు. వాళ్లను దేవుళ్లలాగా ఆరాధించటం కూడా ఎవరిష్టం వారిది! కాని, అందరి వద్దా చందాలు వసూలు చేసి భక్తి , శ్రద్ధలతో చేసుకోవాల్సిన వినాయక ఉత్సవాల్ని ఇలా గ్లామరైజ్ చేయటం ... ప్రతీ సంవత్సరం విడుదలైన సినిమాను తీసుకొచ్చి మండపంలో ఇరికించటం... ఇదంతా సబబు కాదు! పైగా ఇలాంటి సరదా పనులు ఎక్కువైతే సీరియస్ నెస్ తగ్గిపోయి కొన్నాళ్లకి అసలు ఉత్సవాలే ఎవరూ పట్టించుకోకుండా పోయే ఛాన్స్ వుంది. గణపతికి సినిమా రంగు పులుమే వాళ్లే కాదు ఆటల్ని తీసుకొచ్చి అద్దేవాళ్లూ వుంటారు! ఓ సారి ఫుట్ బాల్ వాల్డ్ కప్ జరుగుతోంటే చేతిలో ఫుట్ బాల్ పట్టుకుని, నిక్కర్ వేసుకున్న గణపతిని పెట్టారు కొందరు ప్రబుద్ధులు! ఇక మోదీ, చంద్రబాబు వంటి నేతల ప్రేరణతో వినాయకుని, ఆయా నేతల్ని కలిపి మంటపాల్లో ప్రతిష్టించిన సందర్భాలు కూడా వున్నాయి. ఇవన్నీ వినాయక ఉత్సవాల శోభని తగ్గిస్తాయి! అంతే కాక తమకు ఎలాంటి ప్రమేయం లేకున్నా అత్యుత్సాహం చూపే గణపతి ఉత్సవ నిర్వాహకుల వల్ల ... హీరోలు, నేతలు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది! కాబట్టి , ఇలాంటి విడ్డూరమైన గణపతుల్ని స్థాపించే ముఠాలపై ఏ వీధిలోని పెద్దలు అక్కడే ఓ కన్నేసి వుంచితే... చాలా మంచిది!
http://www.teluguone.com/news/content/lord-ganesh-45-66107.html





