ఇంతింతై.. వటుడింతై.. లోకేష్
Publish Date:Dec 11, 2023
Advertisement
రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ మూడువేల కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్రకు ముందే.. గత ప్రభుత్వంలో మంత్రిగా తన సమర్థతను నిరూపించుకున్న లోకేష్ ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా ఎదిగేందుకు లోకేష్ కు యువగళం పాదయాత్ర దోహదపడింది. ఇప్పుడు నాయకుడిగా, ప్రజా నాయకుడిగా, యువతకు ఉత్తేజాన్నిచ్చే శక్తిగా లోకేష్ ఎవరికీ ప్రూవ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పాదయాత్ర యువతలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. సీనియర్లు కూడా బద్ధకాన్ని వదుల్చుకుని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా చేసింది. గత నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కార్ వేధింపులకు లోనైన పార్టీ కార్యకర్తల్లో స్థైర్యాన్నీ, ధైర్యాన్నీ నింపింది. జనాలకు భవిష్యత్ పై ఆశలు రేకెత్తించింది. అయితే ఇదంతా అంత ఆషామాషీగా జరగలేదు. వేల మంది పోలీసులు, వందల మంది వైసీపీ సోషల్ మీడియా సిబ్బంది, అంతకంటే ఎక్కువగా వైసీపీ మూకలు అడుగడుగునా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు శతథా ప్రయత్నించారు. అసలు జనమే లేరంటూ అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ సామాజిక మాధ్యమంలో పోస్టుల మీద పోస్టులతో బదనాం చేయాలని ప్రయత్నిస్తే.. పోలీసులు లోకేష్ పాదయాత్ర దారిలో జనమే లేరన్న ఫొటోలను క్రియేట్ చేసి అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ కు అందించడంలో మునిగిపోయారు. ఇక వైసీపీ మూకలైతే పాదయాత్రలో గందరగోళం సృష్టించి, శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయడానికి చేయని ప్రయత్నం లేదు. చివరాఖరికి లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ సర్కార్ జీవో 1 తీసుకు వచ్చింది. ఆ జీవో పేరుతో లోకేష్ మైకు కూడా లాక్కొంది. ఆయన నిలబడిన స్టూల్ కూడా లాగేసింది. కానీ లోకేష్ వాటన్నిటినీ అధిగమించారు. సోమవారం (డిసెంబర్ 11)న లోకేష్ పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఈ పాదయాత్ర లోకేష్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పింది. జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై లోకేష్ ముందుకు సాగారు. సాగుతున్నారు. పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. దానిని జనం ప్రత్యక్షంగా తమ కళ్లతో చూశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆయనను ఆరంభంలో ఎగతాళి చేసిన వారు సైతం కళ్లప్పగించి ఆయన మేకోవర్ చూశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్వీయ క్రమశిక్షణ, కఠోర శ్రమ, ఆ రెంటికీ మించి ప్రజల కష్టాలు తీర్చాలి, ప్రజా సేవ చేయాలన్న రాజకీయ సంకల్పంతో లోకేష్ అడుగులు వేశారు. నిస్సందేహంగా నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే లోకేష్ కు ముందు పలువురు రాజకీయ నేతలు పాదయాత్రలు చేశారు. అయితే వారి పాదయాత్రలకు లోకేష్ పాదయాత్రకూ చాలాచాలా తేడా ఉంది. లోకేష్ విపక్ష నేత కాదు. పోనీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకుడు కాదు. ఒక సాధారణ నేత. ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనే ఉద్దేశంతో ఎలాంటి యాస్పిరేషన్స్, పదవీ కాంక్ష లేకుండా చేసిన యాత్ర. అన్నిటికీ మించి ఈ పాదయాత్ర ప్రజలలో లోకేష్ పట్ల విశ్వసనీయత పెంచింది. అలా పెంచేలా లోకేష్ మాట, నడక, నడత ఉంది. గతంలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా నారా లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల నడక పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తానిచ్చిన హామీలతో శిలాఫలకాలు వేయించారు. తెలుగుదేశం టీడీపీ అధికారంలోకి ఆ హామీలన్నీ నెరవేరుస్తానని వాటి ద్వారా చెరిపేయడానికి, విస్మరించడానికీ తావులేని ఆధారాలను ఆయనే ఆ శిలాఫలకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు . మొత్తంగా లోకేష్ ను ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఈ పాదయాత్ర ఆయనను ప్రజల ముందు ఆవిష్కరించింది.
http://www.teluguone.com/news/content/lokesh-reached-3000-kilometers-milestone-25-166789.html





