ఫిబ్రవరిలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?
Publish Date:Dec 10, 2023
Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక వెంటనే ఏపీలో ఎన్నికల సందడి ఆరంభం కానుంది. ఔను ఏపీలో మరో రెండు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒక్క ఏపీ ఎన్నికలే కాదు సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ నెలలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో విజయం సాధించిన జోష్ లో సార్వత్రిక ఎన్నికలను నెల నెలా పదిహేను రోజుల ముందుకు జరపాలని భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలలో విజయం ఇచ్చిన జోష్ లో ముందస్తుకు వెళ్లడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేయవచ్చన్న భావన బీజేపీ హై కమాండ్ లో వ్యక్తం అవుతోందని అంటున్నారు. ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చని అంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బీజేపీ నెల లేదా నెలన్నర ముందుగానే ఎన్నికలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఏర్పాటును దాదాపుగా పూర్తి చేసేసింది. ముఖ్యంగా ఏపీలో రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం, ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వంటివి పూర్తైపోయాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుకూడా జరగాల్సి ఉంది. వాటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రక్రియ జోరందుకుంది. ఏపీలో జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ రెడీ అయిపోయిందనే చెప్పాలి. మామూలుగా అయితే సార్వత్రి ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే అంత సమయం ఇచ్చే అవకాశం లేదనీ ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయనీ గత కొంత కాలంగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ జనవరి మూడు లేదా నాలుగో వారంలో వెలువడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి షెడ్యూల్ విడుదల చేసి మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రెండు నెలలలో పూర్తి చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అదీ గాక ఈ సారి సార్వత్రి ఎన్నికలను నాలుగైదు విడతలలోనే ముగించాలని కూడా సీఈసీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీలో మాత్రం ఒకే విడతలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలను నాలుగైదు లేదా అంతకంటే ఎక్కువ విడతలలో నిర్వహించాలని కోరినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో పరిశీలకులు అలా జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటుండటం కొసమెరుపు.
http://www.teluguone.com/news/content/-ap-assembly-elections-likely-to-be-in-febraury-25-166779.html





