చందానగర్‌లో లిఫ్ట్ ప్రమాదం.. మహిళ దుర్మరణం..!
Publish Date:Aug 4, 2026
Advertisement
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..! ఇంటి నుంచి సాధారణంగా బయటకు వచ్చిన ఆ మహిళకు.. అదే రోజు చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. లిఫ్ట్‌లోకి అడుగు పెట్టిన క్షణాల్లోనే చోటుచేసుకున్న ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొంది. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో అనసూయ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్ మెంట్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌కు చేరుకున్నారు. అనంతరం లిఫ్ట్ బటన్ నొక్కగా తలుపులు తెరుచుకున్నాయి. లిఫ్ట్‌లోకి అనసూయ కాలు పెట్టగానే.. ఒక్కసారిగా లిఫ్ట్ కదిలింది అనుకోని ఈ పరిణామంతో ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో నడుము భాగంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు తీసి చందానగర్‌లోని అర్చన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అన సూయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌కు మరమ్మతులు జరుగుతున్నట్లు సమాచారం. లిఫ్ట్ నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకపో వడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? లేక సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతురాలి భర్త శ్రీనివాస్ నలగండ్లలోని అపర్ణ జెనిత్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వీరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కు చెందినవారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణ, మరమ్మతులు చేపట్టిన విధానం, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Lift accident in Chandanagar, Annapurna Enclave Apartment, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
http://www.teluguone.com/news/content/lift-accident-in-chandanagar-36-228030.html





