కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్లుకు కీలక పదవులు..రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!.
Publish Date:Aug 13, 2026
Advertisement
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతర్గత అసంతృప్తులు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం తీవ్ర బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. తాను అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ అరాచకాలపై తొలిసారిగా గళమెత్తింది తానేనని, ఆ కారణంతోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని గుర్తుచేశారు. మునుగోడు ఉపఎన్నికలో తనను ఓడించేందుకు ఏకంగా వంద మంది ఎమ్మెల్యేలను రప్పించి మోహరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధులు నిజాయితీగా లేకపోతే వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ చిత్రాన్ని మార్చే శక్తి తన వద్ద ఉందని, నిజాయితీ కలిగిన వ్యక్తులు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహా రాజకీయ విప్లవాన్ని తెలంగాణలోనూ తీసుకురాగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏపూరి సోమన్న లాంటి ప్రజా కళాకారులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరింత శృతిమించక ముందే అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. Komatireddy Rajgopal Reddy, Telangana Congress, Munugode MLA, Epuri Somanna, Telangana Politics
http://www.teluguone.com/news/content/komatireddy-rajgopal-reddy-36-228888.html





