కేఎల్ రాహుల్ సెంచరీ.. సఫారీస్ పై భారీ స్కోర్ దిశగా భారత్
Publish Date:Dec 26, 2021
Advertisement
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన జట్టుకు రాహుల్, మయాంక్ జోడీ శుభారంభాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. 60 పరుగులు చేసిన మయాంక్.. లుంగి ఎంగిడి బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. రాహుల్‌తో కలిసి సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు.ఈ క్రమంలోనే 218 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఏడో సెంచరీ. 99 పరుగులు వద్ద మహారాజ్ బౌలింగులో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు రాహుల్. జట్టు స్కోర్ 199 పరుగుల దగ్గర ఉండగా.. 35 పరుగుల వ్యక్తిగత వద్ద కెప్టెన్ కోహ్లీ అవుటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు లుంగి ఎంగిడి ఖాతాలోనే పడ్డాయి.
http://www.teluguone.com/news/content/kl-rahul-century-india-good-score-in-south-africa-first-test-39-129116.html





