కిసాన్ పరివార్ పేరుతో భారీ మోసం..నిందితుడు అరెస్ట్..!
Publish Date:Jul 4, 2026
Advertisement
అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన 'కిసాన్ పరివార్' సంస్థల నిర్వాహకుడు భూపాల్ నాయక్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కిసాన్ పరివార్, కిసాన్ పరివార్ లిమిటెడ్, కిసాన్ పరివార్ ఇండస్ట్రీస్, షేర్స్ బజార్ పేర్లతో పలు సంస్థలను ఏర్పాటు చేసిన భూపాల్ నాయక్... అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ వేలాది మంది నుంచి లక్షల రూపాయల చొప్పున పెట్టుబడులు సేకరించాడు. ప్రారంభంలో ఏడాది పాటు సకాలంలో వడ్డీలు చెల్లించి పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించిన సంస్థ... ఆ తర్వాత అసలు, వడ్డీ రెండూ చెల్లించకుండా బోర్డు తిప్పేయడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గుజరాత్ పోలీసులు భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పది రోజుల క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం గుజరాత్ పోలీసులకు అప్పగించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవడంతో, ప్రస్తుతం అతడిని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు శనివారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2022 నుంచి ఈ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నామని, తొలి ఏడాది వరకు వడ్డీలు సకాలంలో చెల్లించి నమ్మకం కల్పించిన సంస్థ... ఆ తర్వాత వడ్డీలు కాదు కదా, అసలు కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 1,200 మంది వరకు మోసపోయినట్లు సమాచారం. మధ్యతరగతి ప్రజలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. "నా కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో ఇందులో పెట్టుబడి పెట్టాను. చివరకు వాళ్లు మోసం చేయడంతో అప్పులు చేసి కూతురి పెళ్లి చేయాల్సి వచ్చింది" అని బాధితుడు సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు."మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి" అని బాధితురాలు మాధవి ప్రభుత్వాన్ని కోరారు. కంపెనీల పేరుతో అమాయక ప్రజలను ఆకర్షించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ భారీ ఆర్థిక మోసంపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kisan-parivar-36-225044.html





