టీఆర్ఎస్ ఎంపీ టికెట్ కోసం వైసీపీ రాయబారం
Publish Date:Mar 12, 2019
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ ఒకేసారి జరగనుండగా.. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో.. పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 17 సీట్లలో మిత్రపక్షం ఎంఐఎంకు ఒక సీటు పోగా.. మిగిలిన 16 సీట్లలో విజయం సాధించాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఖమ్మం ఎంపీ సీటు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు చేదు ఫలితం ఎదురైంది. మొత్తం పది స్థానాలకు గాను ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటుని ఎలాగైనా గెలుచుకొని సత్తా చాటాలనుకుంటుంది. అయితే అభ్యర్థి విషయంలోనే కాస్త గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. 2014 లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి తరువాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేతతో పాటు కేటీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. అయితే జిల్లాలో ఏర్పడిన గ్రూప్ రాజకీయాలే ఇప్పుడు ఆయన టికెట్ కి పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలో ఏర్పడిన విభేదాలే ఖమ్మం జిల్లాలో చేదు ఫలితానికి కారణమని కేసీఆర్ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం చెప్పారు. మరోవైపు ఎంపీ పొంగులేటి వల్లే తాము ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, మదన్ లాల్, పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటికి ఎంపీ టికెట్ ఇస్తే తాము పని చేయమని జిల్లా టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌తో చెప్పినట్టు సమాచారం. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సైతం ప్రత్యామ్నాయ అభ్యర్థిగా వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరును సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే పొంగులేటిని రాజ్యసభకు గానీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి వర్గం లోకి తీసుకుంటానని, తాను ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించే భాద్యత తీసుకోవాలని కోరినట్టు సమాచారం. అయితే ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న పొంగులేటి మరోవైపు నుండి ఈ మేటర్ ని నరుక్కొస్తున్నారట. పొంగులేటి తన పాత సాన్నిహిత్యాన్ని ఉపయోగించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆశ్రయించి ఖమ్మం ఎంపీ టికెట్ వచ్చేలా చేయమని కోరారట. దీంతో జగన్.. తన పాత సన్నిహితుడ్ని ఆదుకోడానికి ఈ టాస్క్ ను మాజీ ఎంపీ మిధున్ రెడ్డి కి అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే మిధున్ రెడ్డి, కేటీఆర్‌ను కలిసి జగన్ మనోగతాన్ని వివరించారని సమాచారం. మరి వైసీపీ రాయబారం పొంగులేటికి టికెట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
http://www.teluguone.com/news/content/khammam-trs-mp-ticket-issue-39-86236.html





