హెలికాఫ్టర్ గుర్తును చూసి భయపడుతున్న జగన్
Publish Date:Mar 13, 2019
Advertisement
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. మోడీ, కేసీఆర్‌లకు ఊడిగం చేయడానికి జగన్ రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ కోరేది మార్పు కాదు.. ఏపీ మరణ శాసనమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోటల్లా జగన్ సంతకం పెడతారని ఆరోపించారు. తన మాట వినకుంటే జగన్ అవినీతి ఫైల్‌పై కేసీఆర్ సంతకం పెడతారని అన్నారు. డబ్బులు ఇస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు. జనరల్ సెగ్మెంట్‌కు ఓ రేటు.. రిజర్వేషన్ సెగ్మెంట్‌కు ఓ రేటు పెట్టారంటూ పార్టీ వీడిన వారే చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు జగన్ చూపిస్తారని, వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వాస్తవ పరిస్థితులపై తీసుకుంటున్న ప్రజాభిప్రాయంలో టీడీపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హెలికాఫ్టర్ గుర్తును చూసి కూడా ఫ్యాన్ గుర్తేమో అని భయపడే పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఖరారు తర్వాత కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాని, క్షేత్రస్థాయిలో నాణ్యమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని వెల్లడించారు. అవతల పార్టీ మాదిరి డబ్బులకు కక్కుర్తి పడి అభ్యర్థుల్ని మార్చే పద్ధతి టీడీపీది కాదని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం సరిగా లేకుంటే అభ్యర్థుల్ని మార్చడానికి వెనుకాడనని స్పష్టం చేసారు.
http://www.teluguone.com/news/content/ap-cm-chandrababu-fires-on-ys-jagan-39-86239.html





