బెజవాడ తెలుగుదేశంలో నానీ బ్రదర్స్ ట్రబుల్ వెనుక పీవీపీ
Publish Date:Aug 13, 2023
Advertisement
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలలో ఒక విధమైన వేడి కనిపిస్తున్నది. అధికార వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి రగులుతుంటే.. ప్రతిపక్ష తెలుగుదేశంలోనూ కొన్ని కీలక నియోజకవర్గాలలో వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ రాజధానిగా చెప్పుకుని విజయవాడలో తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేశినేని పార్టీకి దూరంగా ఉంటున్నారని అంతా భావిస్తున్నా.. ఆయన వ్యవహార శైలితో పార్టీయే ఆయనను దూరం పెట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఇప్పుడు తెలుగుదేశం కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మరి కొద్ది రోజులలో కృష్ణా జిల్లాలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆ పాదయాత్ర బాధ్యతలను పార్టీ అధిష్ఠానం కేశినేని చిన్నికి అప్పగించింది. దీంతో కేశినేని నానిని పార్టీ పూర్తిగా పక్కన పెట్టినట్టే అన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. అయితే ఈ పరిస్థితికి కేశినేని నాని స్వయంకృతాపరాథమే కారణమని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు కీలకమైన బెజవాడ లోక్ సభ నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని రంగంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కేశినేని నాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎంపీ కేశినేని నాని గత కొంత కాలంగా పార్టీకి అయిష్టమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒకవైపు వైసీపీ పాలనను తప్పు బడుతూనే మరోవైపు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును మెచ్చకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సొంత పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార పార్టీలో ఒకరిద్దరు నేతలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఓ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నాని.. వైసీపీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తారు. సొంత పార్టీ ఇన్‌ఛార్జ్‌లను గొట్టంగాళ్లంటూ కామెంట్ చేశారు. ఇండిపెండెంట్‌గా తనకు గెలిచే సత్తా ఉందని మరో కార్యక్రమంలో మాట్లాడారు. చివరకు మహానాడుకు తనను ఆహ్వానించలేదంటూ పార్టీ నాయకత్వంపైనే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ నానిని పక్కన పెట్టేందుకే తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించిందని అంటున్నారు. అందుకే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర బాధ్యతలను ఎంపీ నానిని కాదని అతని తమ్ముడు కేశినేని చిన్నికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎంపీ నానీ వాట్ నెక్స్ట్ అనే పొలిటికల్ క్యూరియాసిటీ ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి కొంతకాలంగా కేశినేని నానిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారిపై పొగడ్తలు కురిపించడం పార్టీ నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. అదే సమయంలో సొంత పార్టీ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లను గొట్టంగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరహా వ్యాఖ్యలతో పాటు సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా నాని దూరంగా ఉండడంతో అసలు నానీ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా అన్న చర్చ కూడా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ యువగళం పాదయాత్ర బాధ్యతలు కూడా ఆయనకు ఇవ్వకుండా, సోదరుడు చిన్నికి అప్పగించడం ద్వారా అధిష్టానమే ఆయన్ను సైడ్ చేస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నాని ధిక్కార స్వరం వెనుక వైసీపీ ట్రాప్ ఉందనీ, ఆయన అధికార పార్టీ ట్రాప్ లో పడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో నానీ చేతిలో పరాజయం పాలైన అప్పటి వైసీపీ అభ్యర్థి పీవీపీ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని ఇటు తెలుగుదేశం అటు వైసీపీటీడీపీ, వైసీపీ శ్రేణులలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. పీవీపీ ఎంపీ కేశినేని నానిని, టీడీపీని దెబ్బ తీసేందుకు, ఆ ఎంపీకి సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేక వర్గంతో చేయి కలిపి.. ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు. కేశినేని నానీకి వైసీపీ నేతలపై సదభిప్రాయం కలిగేలా ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఎమ్మెల్యేలు నానీ అడిగింది కాదనకుండా చేసేలా పీవీపీ పని గట్టుకొని దగ్గరుండి ఎమ్మెల్యేలను నడిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశంలో చీలిక వస్తే ఈసారి తన విజయం నల్లేరుమీద బండి నడక అవుతుందన్న ఉద్దేశంతోనే పీవీపీ గత మూడేళ్లుగా పక్కా ప్రణాళికతో ఆ వ్యవహారమంతా నడిపించారని అంటున్నారు. ఈ ట్రాప్ లో తనకు తెలియకుండానే కేశినేని నానీ పడిపోయారని కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. తెలుగుదేశం అధిష్టానం నానీ లాంటి నాయకుడిని వదులుకునే ఉద్దేశం లేకనే ఇన్నాళ్లు ఆయన తీరు ఎలా ఉన్నా ఉదాశీనంగా వ్యవహరించిందనీ, అయితే ఈ మధ్య కాలంలో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను వెనకేసుకురావడంతోనే టీడీపీ అధిష్టానం ఇక తప్పక ఆయన తమ్ముడు చిన్నిని ఫోకస్ లోకి తీసుకువచ్చిందని అంటున్నారు. అయితే, వారిద్దరు కొట్టుకుంటే నాకే ప్రయోజనం కలుగుతుందని పీవీపీ వేసిన ఎత్తుగడ కేశినేని విషయంలో పారినా.. రేపు ఎన్నికల వ్యూహంలో ప్రజలను ఎంతవరకు నమ్మించగలరన్నదే చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/kesineni-brothers-trouble-in-vijayawada-telugudesham-39-159949.html





