అయినా కేసీఆర్‌కి ఆనందం లేదు...
Publish Date:Jun 2, 2015
Advertisement
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సంవత్సరం గడిచింది. మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. అలాగే అంతకుముందు రోజున తన రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని విజయవంతంగా ‘ఆపరేషన్ రేవంత్’ ద్వారా ఇరికించేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను నిలబెట్టిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతోషాన్ని కలిగించే అంశాలు. అయితే ఇన్ని విజయాలు సాధించిన ఆయనకు కొన్ని అంశాలు పూర్తి స్థాయి ఆనందం కలగకుండా అడ్డుకుంటున్నాయి. శరీరమంతా ఆరోగ్యంగా వున్నప్పటికీ, కంట్లో వున్న చిన్న నలుసు ఎంతగా ఇబ్బంది పెడుతుందో, ఆ అంశాలు ఆయన్ని అలా ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌కి అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నప్పటికీ అక్కడ కూడా తమ వ్యతిరేక గళాన్ని వినిపించారు. తెలంగాణ వచ్చినప్పటికీ తమకు ఎంతమాత్రం సంతోషం కలగడం లేదని, ఆంధ్రా అధికారుల ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి వస్తోందనేది వారి ఆవేదన. దానితోపాటు అనేక అంశాల మీద వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉస్మానియా విద్యార్థులు ముఖ్యమంత్రికి పూర్తి వ్యతిరేకంగా వున్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించి అరెస్టయ్యారు. తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న ఆగ్రహానికి తోడు ఉస్మానియా స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టించే విషయంలో కేసీఆర్ ప్రదర్శిస్తున్న పట్టుదల కూడా వారి ఆగ్రహానికి కారణమయ్యింది. అలాగే తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌కి అండగా నిలిచిన అనేకమంది కవులు, కళాకారులు, మేధావులు ఈ ప్రథమ ఆవిర్భావ దినోత్సవ నాటికి కేసీఆర్ వెంట లేకుండా పోయారు. అది కూడా కేసీఆర్‌కి పూర్తి స్థాయి ఆనందాన్ని కలగకుండా వుండటానికి ఒక కారణమైంది.
http://www.teluguone.com/news/content/kcr-tealangana-45-46975.html





