ఢిల్లీలో కేసీఆర్ కు చెక్ పెట్టారా?.. అక్కడ చక్రం తిప్పింది ఆయనేనా?
Publish Date:Mar 2, 2022
Advertisement
మళ్ళీ అదే కథ పునరావృతం అవుతోందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ యాత్ర, మళ్ళీ మరోసారి, ‘వెళ్ళొచ్చారు’ అన్నట్లుగానే ముగియ నుందా, అంటే రాజకీయ పరిశీలకులు, పార్టీ వర్గాలు అవుననే అంటున్నారు. అటుఢిల్లీలో, ఇటు హైదరాబద్’లో అదే మాట వినిపిస్తోంది. గతంలో ఒకసారి, ఇలాగే ముఖ్యమంత్రి వరి కొనుగోలు విషయంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్ళారు. నాలుగు రోజులు వుండి వట్టి చేతులతో వెనక్కి వచ్చారు. ఇప్పుడు, మళ్ళీ ఏకంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా జాతీయ స్థాయిలో, ప్రాంతీయ పార్టీలను కూడగట్టి పీపుల్స్ ఫ్రంట్ జెండా ఎగరేసేందుకు మందీ మార్బలంతో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్’ తో భేటి అవుతారని, అక్కడి నుంచి ఆ ఇద్దరు కలిసి, వారాణాసి వెళ్లి, మమతా దీదీతో కలిసి మోడీ వ్యతిరేక శంఖారావం పూరిస్తారని ప్రచారం జరిగింది. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ కాలు పెట్టకముందే, డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా సీన్ మారిపోయింది. కేసేఆర్ ఫ్లైట్ దిగకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇంచక్కా ఫ్లైట్ ఎక్కి బెంగుళూరు వెళ్లి పోయారు. అయితే, కేసీఆర్ తనను కలిసేందుకే ఢిల్లీ వస్తున్నారని తెలిసినా, కేజ్రీవాల్ బెంగుళూరు ఎందుకు వెళ్లి నట్లు? ఏదైనా అనివార్య పరిస్థితుల్లో, బెంగుళూరు వెళ్ళవలసి వచ్చిందా? అంటే, లేదు. అలాంటి అనివార్య పరిస్థితులు ఏమీ లేము. నిజం చెప్పాలంటే, కేసీఆర్’ ను కలవడం ఇష్టం లేక ఆయన్ని అవాయిడ్ చేసేందుకే బెంగుళూరు వెళ్ళారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, కేజ్రీవాల్ ఇలా ఉద్దేశపూర్వకంగా, కేసీఆర్’ను అవాయిడ్ చేయడానికి వెనక ఓ చిన్న ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఒక సీనియర్’ నేత చేసిన సూచన కారణమని కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ఆ నాయకుడు, తమకు సన్నిహితంగా ఉండే, వేరే పార్టీ ఎంపీ ద్వారా కేజ్రీవాల్ ‘కు కేసీఆర్, జాతీయ రాజకీయ యాత్రల అసలు లక్ష్యాన్ని తెలియచేశారు. దీంతో కేజ్రీవాల్, తెలిసో తెలియకో కేసీఆర్’తో చేతులు కలిపితే షాక్ కొట్టడం ఖాయమని ముందుగానే గ్రహించే, ఆయన్ని అవాయిడ్ చేయడం కోసమే బెంగుళూరు ప్రయాణం పెట్టుకున్నారని అంటున్నారు. అయితే, కేసీఆర్ పట్టువదలని విక్రమార్కునిలా, ఇంకా కేజ్రీవాల్’ను ఏదో విధంగా కలిసి రావాలనే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవంక వారాణాసి కార్యక్రమానికి కూడా కేసీఆర్’ కు ఆహ్వానం లేదని, ఒక్క మమతా బెనర్జీని మాత్రమే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచారానికి ఆహ్వానించారని సమాచారం. ఈ పరిణామాలను గమనిస్తే, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కేసీఆర్, ‘అనివార్య’ ఆకాంక్షకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయని అనిపిస్తోందని అంటున్నారు. కేసీఆర్ ముందుగా చెన్నై వెళ్ళారు. స్టాలిన్’ను కలిశారు. కాంగ్రెస్’ , బీజేపీలకు ప్రత్యన్మాయంగా, పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. స్టాలిన్ అప్పుడేమన్నారో ఏమో కానీ, కొద్ది రోజుల క్రితం తమ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కూటమిలోని ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఒక విధంగా బీజేపీ వ్యతిరేక పార్టీల మినీ కాంక్లేవ్’ లా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే, రాహుల్ గాంధీ చేతుల మీదుగా తమ జీవిత చరిత్ర ఫస్ట్ పార్ట్’ను ఆవిష్కరించడం ద్వారా కాంగ్రెస్ చేయి వదిలేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇక ముంబై యాత్ర విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కేసీఆర్ ఇటు రాగానే, అక్కడ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ లేని కూటమిలో తమ పార్టీ చేరదని స్పష్టం చేశారు. శరద్ పవార్ ఇంకో అడుగు ముందుకేసి, కేసీఆర్’ నే కాంగ్రెస్ కూటమిలో చేరమని సలహా ఇచ్చారు. ఇక ఇప్పుడు కేజ్రీవాల్ అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలను కున్నారో ఏమో.. ముందుగానే. కేసేఆర్’ను అవాయిడ్ చేశారు. సో .. కేసేఆర్ జాతీయ కల.. కలగానే మిగిలి పోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే నిజం అయ్యేలా వుంది.
http://www.teluguone.com/news/content/kcr-national-ambitions-facing-bumps-39-132460.html





