మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. అజెండా రాష్ట్రపతి ఎన్నికేనా?
Publish Date:Jun 10, 2022
Advertisement
హమ్మయ్య కేసీఆర్ సుదీర్ఘ మౌనముద్ర వీడారు. శుక్రవారం ఆయన మంత్రులతో, ఎమ్మెల్యేల తోసమావేశం అవుతున్నారు. పార్టీ వ్యవహారాల కోసమేనని చెబుతున్నప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన విధానం ఏమిటన్నదానిపైనే ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ (ఎన్డీయే) అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం అంటూ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కేసీఆర్ ఆ తరువాత ఎందుకో నిరుత్సాహ పడ్డారు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవని భావించి చప్ప బడిపోయారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు మకాం మార్చేసి మౌనమునిలా మారిపోయారు. మాటల మాంత్రికుడిగా, మాటలతో ఎటువంటి వారినైనా నిరుత్తురలను చేయగల సమర్ధుడిగా పేరొందిన కేసీఆర్ మౌనంతో తెలంగాణలో ఒక విధమైన నిశబ్దం తాండవిస్తోందా అనిపించే వాతావరణం నెలకొంది. దీనికంతా కారణం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ చేసిన యత్నాలు అంతగా ఫలించకపోవడమేనని పరిశీలకులు సెటైర్లు వేసినా కూడా పట్టించుకోలేదు. గత కొద్ది కాలంగా విపక్షాల విమర్శలకు సైతం ఆయన మౌనమే సమాధానంగా ఉంటోంది. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చ కోసమే ఆయన పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా ఇప్పటికే ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది నిర్ణయించేశారనీ, దానిని వివరించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. పైకి ఏం చెబుతున్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజర్ కావడమే తెరాస నిర్ణయంగా ఉంటుందని, అదే అధినేత కేసీఆర్ నిర్ణయమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అన్న ఉత్కంఠకుమరి కొద్ది సేపటిలో తెరపడనుంది. టీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయన్నది ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం అయనా, బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినా పెద్దగా ఫరక్ ఉండదు కానీ, టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడమంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడానికి ఓ అడ్డంకి ఉంది. అదేమిటంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులందరూ తప్పని సరిగా ఓటు వేయాలన్న నిబంధన. ఆ నిబంధన నుంచి తప్పించుకుని ఓటింగ్ కు గైర్హాజరయ్యే మార్గాల గురించి కూడా కేసీఆర్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో చర్చంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం బీజేపీకి ఎంత ముఖ్యమో, బీజేపీ ఆధిక్యతను నిరోధించే యత్నం కాంగ్రెస్ కు ఎంత ప్రధానమో, తనదైన ప్రత్యేకతను కల్పోలేదని చాటుకోవడానికి రాష్ట్రపతి ఎన్నిక కేసీఆర్ కూ అంతే ముఖ్యం. బీజేపీ యేతర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం అంటూ శతధా ప్రయత్నించిన కేసీఆర్ ఒకానొక దశలో కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెడితే టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తుందంటూ ప్రతిపాదించేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అది కూడా కుదరకపోవడంతో ఉమ్మడి అభ్యర్థి ఆమోదయోగ్యమైతేనే ఓటు అంటూ ఒ మెట్టు వెనక్కు తగ్గారు. దాంతోనే ఆయన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో గైర్జాజర్ విధానానికే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పార్టీ ప్రజా ప్రతినిథులతో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/kcr-emergency-meeting-with-ministers-25-137424.html





