హస్తిన చేరిన కర్నాటకం!
Publish Date:May 26, 2026
Advertisement
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి లేదా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో..కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. హస్తిన వేదికగా కన్నడ రాజకీయాలపై హైకమాండ్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న కొన్ని విభేదాలకు స్వస్తి పలికి.. రాబోయే రోజుల్లో పాలన మరింత ముమ్మరంగా సాగేలా చూసేందుకు హైకమాండ్ నడుంబిగించింది. ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది. ముఖ్యంగా సీఎం పీఠం మార్పిడి లేదా మంత్రివర్గంలో సమూల మార్పులు చేయడం ద్వారా అసంతృప్తిని చల్లార్చవచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు వర్గాల మధ్య పూర్తిస్థాయి సయోధ్య కుదరని పక్షంలో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో జరుగుతోంది. కేవలం సీఎం మార్పు మాత్రమే కాకుండా.. రాబోయే రాజ్యసభ స్థానాల భర్తీ, రాష్ట్ర శాసనమండలి ( స్థానాల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా ఈ సమక్షంలో చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా హైకమాండ్ ముందుకు సాగుతోంది. ఈ సందిగ్ధతను తొలగించడానికి అధిష్ఠానం కొన్ని ప్రత్యేక ఫార్ములాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడానికి, అలాగే కేడర్‌లో నమ్మకాన్ని పెంచడానికి నాయకత్వ మార్పు అనివార్యమనే కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఫార్ములా ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రిని అలాగే కొనసాగిస్తూ, కేవలం మంత్రివర్గంలో మాత్రమే భారీ మార్పులు చేయడం, పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోవాలంటే రెండో ఫార్ములా ప్రకారం అగ్రనాయకత్వంలోనే మార్పులు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం కూడా సీనియర్లలో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య అధికార పంపకాలపై లోపాయకారీ ఒప్పందాలు జరిగాయనే వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాలంగా నాయకత్వ మార్పుపై పార్టీ లోపల వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, కొందరు మంత్రులపై వస్తున్న ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. దీంతో ఇద్దరు అగ్రనేతలను ఒకే వేదికపైకి తెచ్చి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిపాలన పరంగా , పార్టీ పరంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సామాజిక సమతుల్యత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వివిధ సామాజిక వర్గాల మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వచ్చినందున, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలోనూ, ఇతర కీలక పదవుల్లోనూ సముచిత స్థానం కల్పించడమే ఈ కీలక సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అధిష్ఠానం సీఎం మార్పునకే మొగ్గు చూపితే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుంది. అలా కాకుండా కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో సరిపెడితే, అసంతృప్త నేతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపడం ద్వారా పాలనను మరింత వేగవంతం చేయాలని, ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది.
http://www.teluguone.com/news/content/karnataka-political-crisis-reaches-delhi-45-220868.html





