హిజాబ్‌పై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు.. రచ్చ ముగుస్తుందా? ముదురుతుందా?
Publish Date:Feb 9, 2022
Advertisement
కర్నాటకలో అట్టుడుకుతున్న హిజాబ్ ఎపిసోడ్ ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. పిటిషన్ సింగిల్ బెంచ్ జడ్జి ముందుకు రాగా.. న్యాయమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసులోని అంశాల దృష్ట్యా దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించారు. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను జడ్జి నిరాకరించారు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనిపైనా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు, బెంగళూరు నగరంలో పాఠశాలలు, కళాశాలల దగ్గర నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని ఆదేశించారు. నిషేధం రెండు వారాలపాటు అమలవుతుందని తెలిపారు. 'హిజబ్'.. 'హిజబ్'.. కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వివాదం ఇది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి కళాశాలలో రెండు వర్గాల విద్యార్థుల పోటా పోటీ నినాదాలు.. దాడులు, రాళ్లదాడులు.. విద్యార్థికి కత్తిపోట్లు.. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం.. మూడు రోజులు కర్ణాటక వ్యాప్తంగా కళాశాలలు సహా విద్యా సంస్థల మూసివేతకు దారి తీసిన వివాదం హిజబ్! ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. హిజబ్ ధరించడం అంటే ముఖాన్ని వస్త్రంతో కప్పుకోవడం. కర్ణాటకలో హిజబ్ ధారణ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆపైన రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఒక పక్కన ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హిజబ్ కు అనుకూలంగా స్పందించారు. తమ మతం విద్యార్థినులు హిజబ్ ధరించి కళాశాలకు వస్తే తప్పేంటంటూ సమర్థించారు. ఇంకో పక్కన హిజబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కర్ణాటకలోని హిజబ్ వివాడం పొరుగు రాష్ట్రాల వరకు రాకూడదని, తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. హిజబ్ వివాదం నెల రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న పీయూ కాలేజిలో మొదలైంది. హిజబ్ ధరించి కాలేజికి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు. అప్పటి నుంచి వారు కాలేజికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి వెళ్లిపోతున్నారు. హిజబ్ తీసేస్తేనే కాలేజిలోకి అనుమతిస్తామని ఆ ఆరుగురు విద్యార్థినులకు పాలకమండలి సభ్యుదు, ఎమ్మెల్యే రఘుపతి భట్ చెప్పారు. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆ విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హిజబ్ ధరించే విద్యార్థినుల సంఖ్య వేలల్లోకి చేరింది. గతంలో హిజబ్ ధరించని వారు కూడా కొత్త సంప్రదాయానికి తెరలేపారు. బైందూరులో హిజబ్ ధరించి కాలేజికి వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ లోకిని అనుమతించకుండా అడ్డుకుని, గేటు కూడా మూసివేశారు. దీంతో హిజబ్ వివాదం మరింతగా ముదిరి పాకాన పడింది. హిందూ సంఘాలు పోటీగా రంగంలోకి దిగడంతో మరింత రచ్చ రాజుకుంది. హిజబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలు, తలపాగాలు ధరించి కొందరు విద్యార్థులు కాలేజిలకు వచ్చారు. అయితే.. అప్పటి వరకు నిరసనలకే పరిమితమైన హిజబ్ వివాదం ఇరు వర్గాల మధ్య మంగళవారం హింసాత్మకంగా మారింది. హిజబ్ కు అనుకూల, వ్యతిరేక విద్యార్థుల ప్రదర్శనలతో ఉడిపి, శివమొగ్గ, భాగల్కోటె, దావరగెరె జిల్లాల్లోని విద్యా సంస్థలు అట్టుడికిపోయాయి. కొడగు జిల్లా కుశాలనగర్ సుందరనగర కాలేజిలో తన స్నేహితురాలికి బలవంతంగా కాషాయం శాలువా వేసేందుకు యత్నించిన విద్యార్థిపై వైరి పక్షం కత్తులతో దాడి చేసి, భుజం, వెన్నుపై గాయాలు చేసింది. ఈ కేసులో విద్యార్థులు విక్కు, ధనును పోలీసులు అరెస్ట్ చేశారు. శివమొగ్గ కాలేజిలో కొందరు విద్యార్థులు జాతీయ జెండాను కిందకు దించేసి కాషాయ జెండా ఎగరేశారు. దీంతో ఈ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. హిజబ్ వివాదం వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. హిజబ్ అంశం లోక్ సభలో కూడా ప్రతిధ్వనించింది. ఈ అంశంపై కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, వీసికే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యాంగబద్ధమైన తమ హక్కుల కోసం కోర్టులో పోరాడుతున్న తమ మతం విద్యార్థినులు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని కర్ణాటక హైకోర్టు విజ్ఞప్తి చేసింది. హింసాత్మక ఘటనలు జరగడంతో విద్యా సంస్థలకు సీఎం బొమ్మై మూడు రోజులు సెలవులు ప్రకటించారు. హిజబ్ వివాదంపై బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత, బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. ‘హిజబ్ తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్య. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, ముస్లింమహిళలను చిన్నచూపు చూడడాన్ని భారత నాయకులు ఆపేయాలి’ అని మలాలా ట్వీట్ చేశారు. కర్ణాటకలో రగిలిన హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ రియాక్ట్ అయ్యారు. ముస్లిం బాలికలను చదువుకోకుండా నిరోధించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు. ఈ ప్రాథమిక హక్కును ఎవరైనా నిరాకరించడం, హిజాబ్ ధరించినందుకు వారిని భయభ్రాంతులకు గురి చేయడం కచ్చితంగా అణచివేత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను ఓ ప్రాంతానికి, వర్గానికి పరిమితం చేయాలనే భారత ప్రభుత్వ పన్నాగంగా దీనిని ప్రపంచం తెలుసుకోవాలన్నారు పాకిస్తాన్ మంత్రి.
http://www.teluguone.com/news/content/karnataka-high-court-judgement-on-hizab-39-131516.html





