బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.!
Publish Date:Aug 17, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యాఖ్యలు మరో సారి తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కవిత.. అప్పటి నుంచీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పలు ఇంటర్వ్యూలలో కవిత.. బీఆర్ఎస్ లో తనపై జరిగిన రాజకీయ కుట్రలను, ఎదుర్కొన్న అవమానాలను ఎలంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ వస్తున్నారు. తాజాగా మరో సారి ఆమె బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఈ సారి ఆమె నేరుగా తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కవితను తాము పార్టీ నుంచి పంపించలేదనీ.. ఆమెకు అనేక రాజకీయ అవకాశాలు కల్పించినప్పటికీ సొంత నిర్ణయాలతో దూరమయ్యారని పేర్కొన్న వ్యాఖ్యలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం, షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఏ వివరణ కోరకుండానే సస్పెన్షన్ వేటు వేయడం వెనుక సొంత పార్టీలోనే కొందరు కుట్రపన్నారన్నారు. ఈ పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, తన కన్నతండ్రి కేసీఆర్‌ను కూడా కలవనీయకుండా కొందరు డ్డుకున్నారని కవిత ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించిన కవిత, కేసీఆర్ కుమార్తెగా ఉన్న తనకు పార్టీలో ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాట బాట పట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. అదలా ఉండగా.. కల్వకుంట్ల కవిత విమర్శలు, ఆపోపణలపై బీఆర్ఎస్ అధినాయకత్వం సరైన రీతిలో స్పందించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కవిత లేవనెత్తిన సాంకేతిక, వ్యక్తిగత అనుభవాలకు సమాధానం ఇవ్వలేకపోయారు. Kalvakuntla Kavitha, KCR KTR BRS Dispute, Telangana Rakshana Sena, Telangana Politics, BRS Internal Conflicts
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-25-229060.html





