ప్రజాప్రతినిధుల మధ్య వాటాలపంపకంలో విభేదాలు
Publish Date:Feb 21, 2012
Advertisement
నిలిచిపోయిన సోమశిల ప్రాజెక్టు పనులు
కడప: వాటాల పంపకంలో ప్రజాప్రతినిధులు మధ్య విభేదాలు తలెత్తడంతో సోమశిల నీటి పథకం పనులు నిలిచిపోయాయి. ఒక వైపు పథకం నిర్మాణ వ్యయం ఏటేటా రెట్టింపవుతుంటే మరో వైపు మూడేళ్ళగా ఈ పథకానికి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. నిధులు తెప్పించుకోవడంలో జిల్లా మంత్రులు కూడా విఫలమయ్యారు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి. నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వారు కోర్టుకెళ్ళారు. దీంతో కడప, ప్రొద్దుటూరులో నెలకొన్న మంచినీటి సమస్యతో పాటు కడప, అనంతపురం జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి బ్రేక్ పడింది. ఈ పథకానికి 2008లో టెండర్లు పూర్తికాగా, 2009 సెప్టెంబర్ ఆఖరుకు మొదటిదశ, రెండవదశ నిర్మాణాలు పూర్తికావాలి. నిర్మాణ సంస్థల నుంచి జిల్లాకు చెందిన ఓ మంత్రితోపాటు అప్పటి మాజీ మంత్రి వాటా అడిగినట్లు తెలిసింది. ఈ పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నట్లు సమాచారం. పర్సంటేజిలు చెల్లించేందుకు నిర్మాణ సంస్థలు ససేమిరా అనడంతో మూడేళ్ళగా వారు నిధులు రాకుండా అడ్డుపడినట్లు ఆ పనులను పర్యవేక్షించిన ఓ కాంట్రాక్టర్ తెలిపారు. దీనికి తోడు పనులు పెండింగ్ పడటంతో నిర్మాణ వ్యయంలో ఏటా 10 నుంచి 15 శాతం అదనంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మూడేళ్ళలో 30 నుంచి 45శాతం నిధులు పెంచాల్సి ఉంటుంది. అంటే రూ.417 కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి, రెండవ దశ పనులు ప్రస్తుతం రూ.550 కోట్ల అంచనాకు చేరాయి. ఈ పథకం పూర్తయితే కడప నగరంలో నాలుగు లక్షల మందికి, ప్రొద్దుటూరులో రెండు లక్షల మందికి మంచినీటి సమస్య తీరుతుంది. అలగే కడప, అనంతపురం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.
http://www.teluguone.com/news/content/kadapa-24-12047.html





