ఆ క్రైస్తవుల ఆరోగ్య రహస్యం
Publish Date:Dec 25, 2016
Advertisement
Latter-Day Saints (LDS) అనేది క్రైస్తవులలో ఓ ముఖ్యవర్గం. వీరిని Mormons అని కూడా అంటారు. మిగతా అమెరికన్లతో పోలిస్తే వీరు ఎక్కువకాలం జీవిస్తున్నట్లు తేలింది. అందుకు కారణం ఏమిటా అని పరిశోధించినవారికి ఆశ్చర్యపరిచే ఫలితాలు కనిపించాయి. ప్రయోగంలో రెండో దశ ఉపవాసమే అసలు రహస్యం - నిర్జర.
50 ఏళ్ల క్రితమే
LDS క్రైస్తవులు ఇతరులకంటే ఎక్కువకాలం జీవిస్తారనే విషయం దాదాపు 50 ఏళ్ల క్రితమే ప్రచారంలో ఉండేది. వారి మతవిశ్వాసాల ప్రకారం పొగాకుకి దూరంగా ఉండటం వల్లే దీర్ఘాయుష్షు సాధ్యమవుతోందని అందరూ భావించేవారు. అయితే 1994 నుంచి 2002 వరకూ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్న వ్యక్తులను పరిశీలించిన హృద్రోగ నిపుణులకు ఓ కొత్త ఫలితం తారసిల్లింది. గుండె ధమనులలో (arteries) ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తేల్చేందుకు ఈ యాంజియోగ్రఫీని నిర్వహిస్తారు. ఇలా యాంజియోగ్రఫీ చేయించుకున్న 4,629 మందిలో LDS క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే వీరి గుండె ధమనులు మిగతావారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.
LDS క్రైస్తవులలో గుండె సమస్యలు తక్కువగా ఉండటానికి స్పష్టమైన కారణాన్ని తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం మళ్లీ వారు 2002 నుంచి 2006 వరకూ ఓ 515 మందిని పరీక్షించారు. వీరిలోనూ గణనీయంగా LDS క్రైస్తవులు ఉన్నారు. అయితే ఈసారి ప్రయోగంలో భాగంగా ఉన్న LDS క్రైస్తవుల నుంచి కొన్ని వివరాలను సేకరించారు. LDS చర్చి సూచించిన విధంగా పొగ తాగకపోవడం; నెలకి ఓసారి ఉపవాసం ఉండటం; మద్యం సేవించకపోవడం; కాఫీ, టీలు సేవించకపోవడం; సేవా కార్యక్రమాలలో పాల్గొనడం... వంటి నిబంధనలలో ఎవరు ఏ నిబంధనను పాటిస్తున్నారో చెప్పమన్నారు.
LDS క్రైస్తవులు ఆరోగ్యంగా ఉండేందుకు వారు పాటిస్తున్న సూత్రాలన్నీ కారణమే అయినప్పటికీ, ఉపవాసమే ప్రముఖ కారణం అని తేలింది. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు LDS క్రైస్తవులు కానివారిలో కూడా ఉపవాసం చేసే అలవాటు ఉన్నవారిని పరిశీలించారు. వారి గుండె కూడా దృఢంగా ఉన్నట్లు తేలింది. అంటే ఉపవాసమే అసలు రహస్యం అన్నమాట.
కారణం!
ఉపవాసం వల్ల ఆరోగ్యం ఎందుకు మెరుగ్గా ఉంటుందో కూడా కారణం చెబుతున్నారు నిపుణులు. ఉపవాసంతో కడుపుని మడ్చినప్పుడు శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు తగ్గుతాయట. దీనివలన ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటాకణాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మున్ముందు డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. అందుకనే క్రైస్తవులైనా, ఏకాదశిని పాటించే హిందువులు అయినా, రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులైనా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/jesus-christ-34-70584.html





