వెట్రివేల్ రాజీనామా జయలలిత కోసమేనా?
Publish Date:May 17, 2015
Advertisement
అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించి, ఆమెకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను, రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేయడంతో ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు రంగం సిద్దమవుతోంది. కానీ దీనికి సంబంధించి ఏ.ఐ.ఏ.డి.ఎమ్.కె. పార్టీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. కానీ ఈ నెల 22న ఉదయం 8గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జయలలిత అధ్యక్షతన జరుగబోయే సమావేశానికి పార్టీ యం.యల్యేలు అందరూ విధిగా హాజరు కావాలని అందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. బహుశః ఆరోజు వారందరూ కలిసి ఆమెను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం ఆ తరువాత ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం అంతా లాంచనప్రాయమేనని భావించవచ్చును. కర్ణాటక హైకోర్టు ఆమె నిర్దోషిగా ప్రకటించిన వెంటనే ఆమెను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పనీర్ సెల్వం ఆమె కోసం తను ముఖ్యమంత్రి కుర్చీని ఖాళీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ ఆమె మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆరు నెలలులోగా శాసనసభకు ఎంపిక కావలసి ఉంటుంది. కనుక ఆమె తన నియోజక వర్గమయిన శ్రీరంగం నుండే పోటీ చేస్తారని అందరూ భావించారు. పార్టీకి చెందిన రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెట్రివేల్ హటాత్తుగా నిన్న తన పదవికి రాజీనామా చేయడం దానిని వెంటనే స్పీకర్ ఆమోదించడంతో ఆమె ఈసారి ఆ నియోజక వర్గం నుండి పోటీ చేయవచ్చని అందుకే ఆయన తన స్థానాన్ని జయలలిత కోసం ఖాళీ చేసారని అందరూ భావిస్తున్నారు. కానీ శాసనసభకు పోటీ చేసేందుకు ఆరు నెలల సమయం ఉండగా ఆమె ఇంకా అధికారం చేప్పట్టక ముందే ఆయన అంత హడావుడిగా రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటనే ప్రశ్న కూడా అనేక ఊహాగానాలకు తావిస్తోంది. అధికార ఏ.ఐ.ఏ.డి.ఎమ్.కె. పార్టీలో తెర వెనుక ఇంత జరుగుతున్నా పైకి మాత్రం పార్టీలో ఎటువంటి హడావుడి కనబడటక పోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ "అసలు ఆ పార్టీలో తెర వెనుక ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదన్నారు." ప్రధాన ప్రతిపక్షమయిన డీ.యం.కె.పార్టీ కూడా అధికార పార్టీలో ఏమి జరుగబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
http://www.teluguone.com/news/content/jayalalitha-45-46374.html





