తమిళ చరిత్రలో రాజకీయ తన్నులాటలెన్నో!
Publish Date:Feb 10, 2017
Advertisement
పాలిటిక్స్ అంటే పాలన మాత్రమేనా? అస్సలు కాదు! రాజకీయంలో బోలెడు రచ్చ వుంటుంది. అందుకే, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో దేశంలో రాజకీయాలు ఒక్కోలా వుంటాయి. దేనికవే ప్రత్యేకం. ఇక తమిళనాడు గురించైతే చెప్పేదే లేదు! అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువ. వ్యక్తి పూజ విపరీతం. అందుకే, దేశమంతటిదీ ఓ దారైతే... చెన్నై నేతలది మరో దారి! ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోంది! ఇప్పుడు శశికళ, పన్నీర్ సెల్వం మధ్య గొడవ చుస్తున్న వారికి భలే టెన్షన్ గా వుండవచ్చు. కాని, తమిళ రాజకీయ చరిత్ర తెలిసిన వారికి ఇదేం పెద్ద విశేషమూ కాదు, విడ్డూరమూ కాదు! అక్కడ ఎవరో ఇద్దరు అగ్ర నేతల మధ్య భీకర పోరు పదే పదే జరుగుతూ వస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా రాజ్యాంగం కూడా రాసుకోక ముందే అక్కడ బడా నేతలు ఇద్దరు కొట్టుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వారే.. పెరియార్, అన్నాదురై! ద్రవిడ సిద్ధాంతం ప్రచారం చేసి ఉత్తరాది మీద, అసలు భారతదేశం మీదే ద్వేషం నూరిపోశారు పెరియార్. ఆయన 1948లో తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'చీకటి రోజ'ని వ్యాసం రాశారు. కాని, ఆ మొదటి స్వాతంత్ర్య దినం ఆనందదాయకమైందని అన్నాదురై పేర్కొన్నారు. ఇలా వీరిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు పొడసూపాయి. మెల్లగా అవ్వి అభిప్రాయ భేదాలుగా మారి పెరియార్ మణియమ్మను పెళ్లాడటంతో అన్నాదురై పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అప్పుడు, 1949లో ఏర్పడిందే, డీఎంకే! పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై డీఎంకే స్థాపిస్తే ఆయనతో చాలా ఏళ్లు కలిసి నడిచిన ఈవీకే సంపత్ 1961లో కొత్త పార్టీ పెట్టాడు. అందుక్కారణం డీఎంకే ద్రవిడ నాడు అంటూ ప్రత్యేక దేశమే కావాలని డిమాండ్ చేయటం. అది పెరియార్ అన్న కొడుకైన ఈవీకే సంపత్ కు నచ్చలేదు. ఆయన అన్నాదురైతో విడిపోయి హీరో శివాజీ గణేశన్ తో కలిసి తమిళ దేశీయ కట్చి అనే పార్టీ పెట్టాడు. తరువాతి కాలంలో ఇది కాంగ్రెస్ లో విలీనమైపోయింది! అన్నాదురై స్థాపించిన డీఎంకే చాలా ఏళ్లు కాంగ్రెస్ ను తట్టుకుని బలంగా నిలిచింది, కాని, ఆ పార్టీని స్థాపించిన అన్నా మరణించటంతో కరుణానిధి వేగంగా పావులు కదిపాడు. మొదట తనకు అడ్డువచ్చిన నెడుంజెళియన్ అనే నాయకుడ్ని ఎంజీఆర్ సాయంతో అణగదొక్కాడు. కాని,తరువాత కరుణకు సూపర్ స్టార్ ఎంజీఆర్ తోనూ చెడింది. డీఎంకే కోశాధికారిగా వున్న ఆయన్ని అమాంతం తొలిగించాడు. దాంతో ఎంజీఆర్ ఆగ్రహంతో వేరు కుంపటి పెట్టాడు. అలా పుట్టిందే అన్నాడీఎంకే! ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపనతో కరుణానిధి పన్నెండేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. తమిళుల సినిమా అభిమానంతో ఎంజీఆర్ చనిపోయే రోజు వరకూ ఏకబిగిన ఏలుకుంటూ పోయాడు! పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై ఒక పార్టీ పెడితే, ఆయనతో విభేదించిన సంపత్ మరో పార్టీ పెట్టాడు. తరువాత కరుణతో కయ్యానికి దిగిన ఎంజీఆర్ మూడో పార్టీని జనం ముందుకి తెచ్చాడు. అయితే, ఎంజీఆర్ పెట్టిన అన్నాడీఎంకేలో కూడా అగ్ర నాయకుల ఉగ్ర గొడవలు ఎంత మాత్రం ఆగలేదు. ఎంజీఆర్ మరణంతో ఆయన భార్య జానకీ, జయలలితల మధ్య అధికార పోరు భగ్గుమంది. జయను జానకీ రామచంద్రన్ వర్గం ఎంతగా అవమానించినా మొండిగా ఎదురునిలిచి పార్టీని దక్కించుకుంది. క్రమంగా జయలలిత నుంచి పురుచి తలైవీగా, అమ్మగా ఎదుగుతూ వచ్చి తిరుగులేని నాయకురాలైంది. ఇక వేరు వేరు పార్టీల్లో వున్నా కరుణానిధి, జయలలితల దారుణ శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరికి చిప్ప కూడు తినిపించే సంస్కృతికి తెర తీశారు ఇద్దరూ! జయలలిత అనూహ్య మృతితో ఇప్పుడు శశికళ, పన్నీర్ మధ్య దశాబ్దాల తమిళ రాజకీయ సంస్కృతికి తగ్గట్టే రాజకీయ జల్లికట్టు సాగుతోందంటున్నారు తలపండిన విమర్శకులు! చూడాలి మరి.. ఈ సారి వున్న పార్టీ ఎవరి వశం అవుతుంది, కొత్త పార్టీ ఏమైనా వస్తుందా, లేక అసలు వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే అనే పేరన్నా వినిపిస్తుందా? లేదా?
http://www.teluguone.com/news/content/jayalalitha-45-72015.html





