మోదీ సర్కార్... దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు కొత్త పేర్లు పెట్టబోతోందా?
Publish Date:Feb 10, 2017
Advertisement
హైద్రాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కదా.. కాకపోతే, అప్పుడప్పుడూ ఈ విమానాశ్రయం పేరుపై వివాదం చెలరేగుతూనే వుంటుంది! కొందరు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే , మరి కొందరు కనీసం డొమెస్టిక్ టెర్మినల్ కన్నా ఎన్టీఆర్ పేరు పెట్టాలని అంటూ వుంటారు! ఇలాంటి గొడవలు మన దేశంలో మామూలే. అయితే, కేంద్రం త్వరలో ఇలాంటి ఎయిర్ పోర్ట్ గొడవలకి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తోంది! అసలు విమానాశ్రయాలకు ప్రత్యేక పేర్లే లేకుండా చేస్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తోందట! హైద్రాబాద్ లో వున్న ఎయిర్ పోర్ట్ రాజీవ్ గాంధీ పేరున వుంటే, ఢిల్లీ విమానాశ్రయం ఇందిర పేరుతో వుంది. ముంబైలోది ఛత్రపతి శివాజీ పేరుతో పిలవబడుతోంది. ఇలా ఒక్కో నగరంలోని ఒక్కో ఎయిర్ పోర్ట్ ఎవరో ఒక గొప్ప నాయకుల పేరుతో వ్యవహరింపబడుతోంది. అంతే కాదు, ఈ నాయకుల పేర్లతో వున్న విమానాశ్రయాలపై అనేక వివాదాలు , అసంతృప్తులు కూడా వున్నాయి. ఒక పేరు తీసి మరో పేరు పెట్టాలని డిమాండ్లు చేస్తుంటారు కొందరు. అంతే కాదు, దాని కంటే ముఖ్యంగా, విదేశాల నుంచీ వచ్చే ప్రయాణికులు మన దేశ , రాష్ట్ర నాయకుల పేర్లతో వుండే విమానాశ్రయాల్ని పలకలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకి బెంగుళూరులోని అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయం 'కెంపే గౌడా ఎయిర్ పోర్ట్' అంటున్నారు! కెంపే గౌడా బెంగుళూరు నగర స్థాపకులు! ఆయన కన్నడ వాళ్లకు అభిమాన పురుషుడు. కాని, మన దేశంలోనే చాలా మందికి తెలియదు. ఇక ఫారినర్స్ సరిగ్గా పలకటం ఎలా సాధ్యమవుతుంది? ఇండియాలోని ఎయిర్ పోర్ట్స్ పేర్లపై పుడుతోన్న వివాదాలు, వస్తోన్న డిమాండ్స్, విదేశీయులకు కలుగుతోన్న అసౌకర్యం.. అన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర విమానాయాన శాఖ ఓ కీలక నీర్ణయం తీసుకునే యోచనలో వుంది. అసలు వ్యక్తుల పేర్లతో కాకుండా విమానాశ్రయం ఎక్కడ వుందో... ఆ నగరం పేరే దానికి వుండేలా చూడాలని భావిస్తోంది. ఇంకా దీని పై తుది నిర్ణయం ఏం తీసుకోలేదుగాని.. అదే జరిగితే ఇప్పుడున్న పేర్లన్నీ మాయం అయిపోతాయి! ఓన్లీ హైద్రాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు... ఇలా సిటీల పేర్లతో ఎయిర్ పోర్ట్స్ పిలవబడతాయి! జనం నుంచీ, పార్టీల నుంచీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ.... ఇలా అనేక దిక్కుల నుంచీ నిరసనలు వచ్చే అవకాశం వున్న ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంటుందా? లేదా? కొన్నాళ్లు అగితే గాని తెలియదు..
http://www.teluguone.com/news/content/indian-airports-45-72013.html





